
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని స్పష్టం చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. 'ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?' అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
పువ్వాడ అజయ్ ఏమన్నారంటే?
టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తారు. భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఐదు గ్రామాలు దూరంగా ఉంటాయని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు కోరామని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ‘కేసీఆర్‌కు వర్షాలు ఎలా పడతాయో తెలీదా?’