సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నగరంలో నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌లను కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దీంతో భారీ జన సమీకరణపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు అప్పటి టీఆర్‌ఎస్, ఇప్పటి బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తక్కువగానే ఉంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కారు జోరుగా పరుగెత్తితే.. ఖమ్మంలో మాత్రం చతికిలపడింది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం సాధించగా, ఆ తర్వాత మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ పట్టు బిగిస్తూ వచి్చంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా ఖమ్మం నుంచే కదం బీఆర్‌ఎస్ కదం తొక్కేలా చేయాలని అధినాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. ఖమ్మం వేదిక నుంచే వచ్చే ఎన్నికలకు బీఆర్‌ఎస్ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.
భారీ జన సమీకరణపై నజర్..
ఈ నేపథ్యంతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున సభకు భారీయెత్తున జనాన్ని సమీకరించడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి ఈ సభకు జన సమీకరణ చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ప్రజలకు చేరువగా, మమేకమయ్యేలా..
రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న సీఎం కేసీఆర్.. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇందుకు సమాయత్తం చేస్తూనే, తాను స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకలాపాలను కూడా పరుగులెత్తించాలని నిర్ణయించారు. ప్రజలకు చేరువగా, వారితో మమేకమయ్యేలా వీటిని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్లను ప్రారంభించనున్నారు. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అధికార యంత్రాంగంతో సమావేశం కానున్నట్లు తెలిసింది.
ప్రజల్లోకి ప్రజా ప్రతినిధులు..
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమైతే రాష్ట్రంలో ఈ సంవత్సరాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్ నెలను టార్గెట్‌గా పెట్టుకొని మూడు నెలలకు ముందే ఎన్నికలకు సిద్ధమయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పట్నుంచే ప్రజల్లోకి వెళ్లి మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. గ్రామ వార్డు సభ్యుడి నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు, ఎమ్మెల్యేల వరకు.. సంక్రాంతి తరువాత నుంచి ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం.
బలమైన కార్యవర్గాల నియామకం!
టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన నేపథ్యంలో పారీ్టకి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో బలమైన కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేసీఆర్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా బీఆర్‌ఎస్ జాతీయ కార్యవర్గంతో పాటు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణ, ఏపీకి చెందిన ముఖ్య నాయకులు కొందరికి ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల బాధ్యతలను అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అలాగే రాష్ట్ర కమిటీలోకి తీసుకునేందుకు కొందరు ముఖ్యమైన నాయకులను ఎంపిక చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment