సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో నేతల మధ్య సమన్వయం కొరవడుతోందనే చర్చ జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనపడుతోందని చెబుతున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, జిల్లా పార్టీ ఎమ్మెల్యేల నడుమ నెలకొన్న విభేదాలు రచ్చకెక్కగా, మరికొన్ని చోట్ల కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
ఆత్మీయ సమ్మేళనాలకు కేసీఆర్ ఆదేశం
బీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేసేలా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి.. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో అన్ని నియోజకవర్గాల్లో ‘ఆత్మీయ సమ్మేళనాలు’నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది ఆశించిన స్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల సమన్వయ బాధ్యతలు సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
మంత్రులు చొరవ తీసుకోవాలన్నా..
క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలని కేసీఆర్ గత రెండేళ్లుగా పదే పదే నొక్కి చెప్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో క్షేత్ర స్థాయి కేడర్, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు ఫలితాన్ని ఇవ్వడంతో ఈ తరహా భేటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధినేత ఆదేశించారు. గతనెల 15న తెలంగాణ భవన్‌లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ కార్యవర్గ సంయుక్త భేటీలో కూడా ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారంలోగా ఆత్మీయ సమ్మేళనాలు మండలాలు, పట్టణ ప్రాంతాల్లో డివిజన్ల వారీగా నిర్వహించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడావుడి చేశారు. అయితే ఒకటీ అరా నియోజకవర్గాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సమ్మేళనాలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి, అందుకు సంబంధించిన నివేదికలు పంపాలని కేసీఆర్ ఆదేశించారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా చాలాచోట్ల ఇది ముందుకు సాగలేదు.
వంద మంది ఓటర్లకు ఓ ఇన్‌చార్జి ఎక్కడ?
వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చారి్జలను నియమించడంతో పాటు నియోజకవర్గాల వారీగా వారి వివరాలను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సిందిగా కేసీఆర్ నెలరోజుల క్రితం పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున రెండు వేల నుంచి మూడు వేల మంది ఇ¯న్‌చార్జిలు అవసరమవుతారని అంచనా వేశారు. వంద మంది ఓటర్లకు ఇన్‌చారి్జలుగా వ్యవహరించే వారి వివరాలను ఫోన్¯ నంబర్లతో సహా నవంబర్ నెలాఖరులోగా తెలంగాణ భవ¯న్‌కు పంపించాలని ఆదేశించినా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశాల నిర్వహణకు కూడా మంత్రులు చొరవ చూపాల్సి ఉండగా, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్ వంటి కొన్ని జిల్లాల్లోనే ఈ తరహా సమావేశాలు జరిగినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
పెరిగిపోతున్న గ్యాప్
తమ నియోజకవర్గాల్లో మంత్రులు పెత్తనం చెలాయించడాన్ని పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలు సొంతంగా నిర్వహించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు మంత్రులు జిల్లా అధికార యంత్రాంగంపై పట్టు సాధిస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో జరిగే కార్యకలాపాలకు సంబంధించి తమ అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఏర్పడుతోంది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని చూపుతూ కొందరు మంత్రులు తమపై పెత్తనం చేస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఈ తరహా విభేదాలు కొనసాగుతున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment