
వరుసగా పార్టీని వీడుతున్న సిట్టింగ్ ఎంపీలు
ఇప్పటికే కాంగ్రెస్ గూటికి ఒకరు.. బీజేపీలోకి మరో ఇద్దరు
అభ్యర్థిత్వం ఖరారైనా పునరాలోచనలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
మిగతా నలుగురిలోనూ ముగ్గురు పోటీకి దూరం?
మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, కొత్త నేతల పేర్లపై పరిశీలన
ఎన్నికల ఖర్చు భరించే వారికే టికెట్లు అందే చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్‌లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు.
దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్‌ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యరి్థగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
మిగతా నలుగురిపై చర్చ
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి బీఆర్‌ఎస్ నుంచి మరికొందరు ఎంపీలు నిష్క్రమించవచ్చని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత (పెద్దపల్లి) కాంగ్రెస్‌లోకి.. పి.రాములు (నాగర్‌కర్నూల్), బీబీ పాటిల్ (జహీరాబాద్) బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థులుగా బీబీ పాటిల్‌తోపాటు పి.రాములు కుమారుడు భరత్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది కూడా. బీఆర్‌ఎస్‌లోని మరో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రంజిత్‌రెడ్డి అంశంపై చర్చ జరుగుతోంది.
దీంతో మొత్తంగా ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్‌ల భవితవ్యంపై స్పష్టత వచ్చిట్లయింది. మిగతా నలుగురు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం), పసునూరు దయాకర్ (వరంగల్), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్)ల అడుగులు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. సర్వేల ఫలితాలు, ఎన్నికల ఖర్చును దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు నేతలు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
మరికొందరూ పోటీకి దూరం?
ప్రస్తుతం తన కుమారుడి వివాహ వేడుకల ఏర్పాట్లలో ఉన్న నామా నాగేశ్వర్‌రావు మరోమారు బీఆర్‌ఎస్ నుంచి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. మిగతా ముగ్గురిలో పసునూరు దయాకర్, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలకు తిరిగి బీఆర్‌ఎస్ టికెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ప్రస్తుతానికి నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం) మినహా మిగతా వారంతా పార్టీకి దూరం కావడమో లేదా పోటీ నుంచి నిష్క్రమించడమో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మాజీలు, కొత్తవారికి పోటీ చాన్స్!
వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే వార్తల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఈ కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా భేటీలు ముగిశాక వారం పది రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహాన్ని నిశితంగా గమనిస్తున్న కేసీఆర్.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ఉద్దేశంతో కొంత యువ నాయకత్వానికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల వ్యయాన్ని భరించే శక్తి ఉన్న వారికోసం బీఆర్‌ఎస్ అన్వేషణ సాగిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment