సాక్షి, ఢిల్లీ: చికోటి ప్రవీణ్.. తెలంగాణలో సంచలనం సృష్టించిన పేరు. విదేశాల్లో అక్రమ క్యాసినో నడిపించిన వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా చెల్లింపులపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్.. అటుపై నిబంధనలకు విరుద్ధంగా కొన్ని జంతువుల్ని పెంచుకున్నాడనే అభియోగాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో గతకొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు మరింత ఊతం ఇచ్చాయి.
చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఇవాళ కొన్ని పరిణామాలు జరిగాయి. బీజేపీలో చేరొచ్చనే సంకేతాలు ఇస్తూ.. గురువారం ఢిల్లీలో కొందరు తెలంగాణ బీజేపీ నేతలను కలిశాడు ప్రవీణ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలను కలిశాడు. వాళ్లకు శాలువా కప్పి సత్కరించాడు. వీళ్లతో పాటు తాజాగా బీజేపీలో చేరిన జయసుధను సైతం ప్రవీణ్ కలిశాడు.
బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలోనే వీళ్లందరినీ కలుస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇక్కడి నేతలను ఢిల్లీ వెళ్లి మరీ కలవడం గమనార్హం. ఇక.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న వ్యక్తి, పైగా ఈడీలాంటి దర్యాప్తు సంస్థ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంటుందా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment