బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్‌  | Casino King Chikoti Praveen set to join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్‌ 

Oct 8 2023 4:33 AM | Updated on Oct 8 2023 4:33 AM

Casino King Chikoti Praveen set to join BJP - Sakshi

చీకోటి ప్రవీణ్‌కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వ నిస్తున్న డీకే అరుణ  

కాచిగూడ (హైదరాబాద్‌): ధర్మరక్ష సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్యాసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్‌ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో శనివారం ఆ పార్టీలో చేరారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌తోపాటు ఆయన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావుతో కలిసి డీకే అరుణ మాట్లాడుతూ సీఎం పదవి కోసం మంత్రి కేటీఆర్‌.. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుంటే ఆస్పత్రిలో చేర్పించకుండా ఫామ్‌హౌస్‌లో ఉంచడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. సీఎం ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోకుండా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులిద్దరే తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని, ఎవరికి వారే సీఎం పదవి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసం దొంగ నోటిపికేషన్లు వేసి నిరుద్యోగులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కానిస్టేబుల్‌ పరీక్షల ఫలితాలు ప్రకటించారని, అందులో కూడా అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రవీణ్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ధర్మరక్షణ కోసం బీజేపీలో చేరినట్లు తెలిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement