సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్రతీరోజు వేలమంది ప్రాణాలు కోల్పోతుంటే... ఆసుపత్రుల్లో బెడ్ల కోసం, ఆక్సిజన్ కోసం జనం హాహాకారలు చేస్తున్నారు. మరోవైపు వేల కోట్ల రూపాయలతో ఢిల్లీలో చేపట్టిన సెంట్రల్ విస్టా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నించేందుకు ఇది ఆస్కారం కల్పిస్తోంది. వైద్య వ్యవస్థలో మౌలిక వసతుల కొరత కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని విదేశాలు సైతం ముందుకు వచ్చి సహాయం చేస్తున్న సమయంలో, దేశ రాజధానిలో వేలకోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతుండడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.
కరోనా సెకండ్ వేవ్‌తో దేశం తీవ్ర అవస్థలు పడుతోంది. ఎటుచూసినా భయాందోళనలే తాండవిస్తున్నాయి. ప్రతీరోజు 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఒక్కసారిగా సంక్రమణ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో చికిత్సకు కావాల్సిన మందులు, పడకలు, ఆక్సిజన్‌కు కొరత తలెత్తుతోంది. మరోవైపు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ దేశ రాజధాని ఢిల్లీలో రూ.20 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ రోజురోజుకి తీవ్రమవుతోంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దేశంలో కరోనా పరిస్థితులను చక్కదిద్దేందుకు విదేశాల నుంచి సహాయాన్ని అంగీకరిస్తున్న కేంద్రప్రభుత్వం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆరోగ్య వ్యవస్థపై ఇప్పటికైనా దృష్టిసారించి మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని డిమాండ్ మొదలైంది.
శ్వాస అవసరం: రాహుల్
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి నిరంతరం దాడికి గురవుతోంది. తాజాగా ఆదివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుత సమయంలో దేశానికి ప్రధాని నివాసం అవసరం కాదని, దేశానికి శ్వాస అవసరమని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ట్విట్టర్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. మొదటి ఫోటోలో ప్రజలు ఆక్సిజన్ సిలిండర్ల కోసం పొడవైన క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. రెండో ఫోటో... సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కోసం రాజ్‌పథ్ సమీపంలో జరుగుతున్న తవ్వకం పనులకు సంబంధించినది. అంతేగాక గతంలోనూ రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నేరపూరిత వ్యర్థంగా ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.
చదవండి: (కేంద్రం చేసింది క్రూరమైన నేరం: సిసోడియా)
మాజీ ప్రధానమంత్రులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌సింగ్‌లు 70 ఏళ్లుగా సృష్టించిన వ్యవస్థ ఈ రోజు ఎదుర్కొంటున్న క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి దేశానికి సహాయపడిందని శివసేన... భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసింది. కరోనా నియంత్రణ కోసం పొరుగున ఉన్న చిన్న దేశాలు భారతదేశానికి సహాయం అందిస్తుండగా, వేల కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను ఆపడానికి మోదీ ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగాలేదని శివసేన తమ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో రాసింది.
బంగ్లాదేశ్ రెమిడెసివిర్ 10వేల డోస్‌లను పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంకలు కూడా ఆత్మనిర్భర భారతదేశానికి సహాయం అందించాయని పేర్కొంది. అంతకుముందు ఏవైనా విపత్తులు వస్తే పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు ఇతర దేశాల సహాయం పొందేవి. కానీ ప్రస్తుత పాలకుల తప్పుడు విధానాల కారణంగా భారత్ నేడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటోందని శివసేన ఘాటుగా విమర్శించింది. అయితే రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనకు ఇదే నాయకులు మద్దతు ఇచ్చారని, కొత్త పార్లమెంటు భవనం ఆవశ్యకత గురించి యూపీఏ ప్రభుత్వ సమయంలో కాంగ్రెస్ నాయకులు లేఖలు రాశారని కేంద్రమంత్రి గుర్తు చేశారు.
అసలేంటి సెంట్రల్ విస్టా..?
ఢిల్లీలోని రైసినా హిల్స్ సమీపంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనం, కొత్త నివాస సముదాయం నిర్మించనున్నారు. ఇందులో ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలతో పాటు అనేక కొత్త కార్యాలయ భవనాలు, మంత్రిత్వ శాఖల కార్యాలయాల కోసం కేంద్ర సచివాలయం నిర్మించనున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును 2019 సెప్టెంబర్‌లో ప్రకటించారు.
ఈ ప్రాజెక్టుకు 2020 డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ పునాది వేశారు. దీనితో పాటు ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మూడు కిలోమీటర్ల పొడవైన ‘రాజ్‌పథ్’ మార్పును కూడా ప్రతిపాదించారు. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చాక... సెంట్రల్ విస్టా ప్రాంతంలోని నార్త్, సౌత్ బ్లాక్‌లను మ్యూజియమ్‌లుగా మార్చనున్నారు. ఇదే కాకుండా, ఈ ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌ను కూడా మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment