విజయవాడ మున్సిపల్ ప్రచారంలో ప్రతిపక్షనేత చంద్రబాబు
సాక్షి, అమరావతి బ్యూరో/చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): అమరావతి కోసం విజయవాడ ప్రజలు ముందుకు రావడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరో, చెన్నైకో పాచి పనులు చేసుకోవడానికి పోతారు గానీ అమరావతిని కాపాడుకోవడానికి సిద్ధంగా లేరంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో రోడ్డు షో చేపట్టారు. ఆ వివరాలివీ..
మిమ్మల్ని ఏమనాలో..!!
‘పట్టిసీమ నీళ్లు తాగేవాళ్లకు అర్థం కాదా? ఈ పట్టిసీమ నా కోసం తెచ్చానా? అమరావతిని నా కోసం కట్టానా? ఈ ప్రాంతం కోసం.. మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఈరోజు నేను ఓట్లడగాలా మిమ్మల్ని? వాళ్లకే (వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే) ఓటేసి ఆ తర్వాత ఊడిగం చేయండి.. నామీద అభిమానం అక్కర్లా. అవినీతి కంపుకొడుతుంటే మీరు ఇంట్లో ఆనందంగా పడుకోండి’ అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మన పార్టీలో ఫ్రీడం ఎక్కువైంది. కంట్రోల్ చేస్తా.. దీనిపై మాట్లాడకపోతే నేను భయపడినట్లుంటుంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు చెప్పింది కాకుండా మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని జాడ లేకుండా పోయారు.
ప్రజలను బెదిరిస్తున్న చంద్రబాబు
తొలుత భవానీపురంలో ప్రచార రథంపైకి చంద్రబాబుతో పాటు బుద్దా, బోండాలు ఎక్కారు. ‘మీరు వెనక్కి వెళ్లండి.. జనం వాళ్లను (అభ్యర్థులు) చూస్తే నాలుగు ఓట్లేస్తారు. నాయకులు ముందుంటే కష్టాలొస్తాయి ’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో వారిద్దరూ ప్రచార రథం దిగి వెళ్లిపోయారు. కాగా, ఎన్నికల ప్రచార సమయం ముగిసినా చంద్రబాబు ఆదివారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాత్రి 9.57 గంటలకు చుట్టుగుంట వద్ద తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశించి అక్కడ ప్రసంగించారు. రాత్రి 10 తర్వాత కూడా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కొద్దిసేపు ససేమిరా అన్న చంద్రబాబు ఆ తర్వాత కారులోకి వెళ్లిపోయారు. కానీ, ముందుగా నిర్ణయించిన రూట్‌లోనే ర్యాలీగా కొనసాగారు. బైక్ ర్యాలీ నిర్వహించడం సరికాదని పోలీసులు చెప్పినా లెక్కచేయలేదు. చివరకు రాత్రి 11.08కి చంద్రబాబు తాడేపల్లికి బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment