
ఏపీ సీఎస్, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్, భట్టి స్పష్టీకరణ
వివాదాల పరిష్కారం కోసమే సమావేశమయ్యాం
కూర్చుని పరిష్కరించుకుందాం.. కమిటీలు వేసుకుందామని సూచన
ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకునేలా ప్రొటోకాల్ అమలుకు నిర్ణయం
ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలను ప్రస్తావించిన ఏపీ సీఎస్
టీటీడీలో, కోస్తా తీర ప్రాంతంలో వాటాల అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ సీఎస్
తిరిగి వెళ్లే సమయంలో చంద్రబాబు, రేవంత్ మధ్య ముచ్చట్లు
సాక్షి, హైదరాబాద్: ‘విభజన’ సమస్యలకు సంబంధించి వాదనలు అనవసరమని.. వివాదాల పరి ష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేసుకున్నా మని ఆంధ్రప్రదేశ్ సీఎస్, అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేసినట్టు తెలిసింది. వాదనలతో కాకుండా చర్చలతోనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నట్టు సమాచారం. విభజన సమస్యల పరిష్కారం ఎజెండాగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, మంత్రులు, అధికారులు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు తొలుత మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం తాను లేఖ రాసిన వెంటనే సానుకూలంగా స్పందించి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ముందుకు రావడం పట్ల రేవంత్‌రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
కూర్చుని పరిష్కరించుకుందాం..
ఎజెండాలో భాగంగా తొలుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను వివరించారు. 9, 10వ షెడ్యూళ్లలోని అంశాలు, తెలంగాణ పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశాన్ని ప్రస్తావించగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. వివాదాల పరిష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాదనలు అనవసరమని స్పష్టం చేశారు. ఏదైనా కూర్చొని పరిష్కరించుకోవాలని రేవంత్‌తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఉద్యోగుల విభజన, ఏడు విలీన మండలాలు, భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల అంశం, టీటీడీలో, కోస్తా తీర ప్రాంతంలో వాటాలు, ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపకాలు మొదలైన అంశాలను ప్రస్తావించారు. చివరగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సీఎస్‌ల ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ, మంత్రుల ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకునే విధంగా ప్రొటోకాల్ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.

సాదర స్వాగతంతో.. మనసారా నవ్వుకుంటూ..
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్‌కు చేరుకోగా.. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సాదరంగా స్వాగతం పలికారు. సమావేశ మందిరంలోకి వెళ్లిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబును సీఎం రేవంత్ శాలువాతో సత్కరించి.. కాళోజీ రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. నంది జ్ఞాపికను అందజేశారు. తర్వాత చంద్రబాబు సీఎం రేవంత్‌కు శాలువా కప్పి సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన విందులో హైదరాబాదీ దమ్ బిర్యానీతోపాటు ఆమ్లెట్లు, చేపల కూర వంటి వంటకాలను వడ్డించారు. తిరిగి వెళ్లే సమయంలో రేవంత్, చంద్రబాబు ముచ్చట్లాడుకుంటూ కనిపించారు. ఏదో అంశం ప్రస్తావనకు రాగా నవ్వుకుంటూ బయటికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment