ఒంటరిగా గెలిచిందే లేదు.. అందుకే పొత్తుల తక్కెడ! | Chandrababu Never Win Alone Only alliances are the basis | Sakshi
Sakshi News home page

ఒంటరిగా గెలిచిందే లేదు.. అందుకే పొత్తుల తక్కెడ!

Published Mon, Oct 23 2023 3:56 PM | Last Updated on Mon, Oct 23 2023 4:07 PM

Chandrababu Never Win Alone Only alliances are the basis - Sakshi

నారా చంద్రబాబు నాయుడు..   వెన్నుపోటు రాజకీయాలకు మారుపేరు.  ఇక పొత్తులు పెట్టుకోవడంలో నిష్ణాతుడు.  ప్రజలకు ఏనాడు మేలు చేయాలనే ఆలోచనే లేని చంద్రబాబు.. అధికార దాహంతో తపించిపోతూ ఉంటారు.  అధికారమే లక్ష్యంగా పావులు కదిపే చంద్రబాబుకు ఏనాడు పొత్తు లేకుండా గెలిచిన చరిత్రే లేదు. 1995లో మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాగేసుకున్న చంద్రబాబు.. ఆపై పొత్తుల తక్కెడనే నమ్ముకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారు.  

✍️1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు  అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో పొత్తులో భాగంగా బయటనుంచి మద్దతునిచ్చేందుకు అంగీకరించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్‌తోనే ఇక్కడ టీడీపీ గట్టెక్కిందని చెప్పాలి. 1999లో ఎన్నికలకే ముందే కార్గిల్‌ పోరులో పాకిస్తాన్‌పై విజయం సాధించింది భారత్‌. దాంతో బీజేపీలో మంచి జోష్‌ వచ్చింది. దాన్ని క్యాష్‌ చేసుకున్నారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు కలిసి వస్తుందని భావించి దానికి తగ్గట్టే వారి చంకనెక్కి పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. అలా ఆ ఎన్నికల్లో విజయం సాధించింది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ. 

✍️ఇక 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ దెబ్బకు టీడీపీ కుదేలైంది.  2004లో అధికార పక్షంగా ఎన్నికల బరిలోకి దిగింది టీడీపీ. ఇక్కడ కూడా ఎన్డీఏ భాగస్వామిగా రంగంలోకి దిగారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 47 సీట్లకే పరిమితమైంది. 1999 ఎన్నికల్లో 180 సీట్లతో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ.. 2004లో మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది.  2004లో వైఎస్సార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ 185 సీట్లతో తిరుగులేని మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

✍️ఇక 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విచిత్ర కూటమితో తెరపైకి వచ్చారు. మహా కూటమి పేరిట టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ దిగారు చంద్రబాబు. కానీ చంద్రబాబు వేషాలను ప్రజలు పట్టించుకోలేదు. 2009లో చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం ఘోర పరాజయం చవిచూసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 294 నియోజకవర్గాల్లో తెలుగుదేశం 222 స్థానల్లో పోటీకి దిగి, 92 సీట్లు మాత్రమే గెలిచింది. 2009లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు వరుసగా రెండో సారి డా.వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్‌ 294 స్థానాల్లో పోటీ చేసి, 156 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. 

✍️మళ్లీ 2014 ఎన్నికల్లో ఎన్డీఏతో పొత్తు కోసం ప్రదక్షిణలు చేసి మరీ ఎన్నికలకు సిద్థమయ్యారు చంద్రబాబు.  2014 ఎన్నికల్లో చంద్రబాబుకు బీజేపీ-మోదీ హవా కలిసొచ్చింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 160 స్థానాల్లో పోటీ చేయగా, 102 సీట్లు గెలిచింది. 2014 ఎన్నికల్లో గెలుపోటముల భయంతో అసలు పోటీకే దిగలేదు పవన్‌ కళ్యాణ్‌. 

✍️2019లో సైకిల్ పంక్చర్ అయ్యింది. రెండు రాష్ట్రాల్లో చేదు ఫలితాలను చవిచూసింది. 2019 ఎన్నికల్లో సింగిల్ గా సైకిల్ గుర్తుతో పోటీకి దిగి అత్యంత చెత్త పరాజయాన్ని నమోదు చేశారు చందద్రబాబు. 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 23 స్థానాలకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన వైఎస్సార్‌సీ అద్భుత విజయంతో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

✍️2019 ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులతో వచ్చిన జనసేన ఘోర పరాజయం చవిచూసింది. పోటీ చేసిన రెండు చోట్ల పవన్‌ కళ్యాణ్‌ చిత్తుగా ఓడిపోయారు. కేవలం జనసేన ఒక స్థానాన్ని మాత్రమే గెలవగా,   తనకు ఓటేయ్యడం లేదంటూ జనంపైనే నిందలు వేసే యత్నం చేశారు.  చంద్రబాబు తనయుడు లోకేష్ (అప్పటికే దొడ్డి దారిలో మంత్రి), మంగళగిరి నుంచి పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశారు.

✍️2014 నుంచి 2019 మధ్య కాలంలో ఓటుకు కోట్లు గుమ్మరించి అడ్డంగా వీడియోలు, ఆడియోలతో చంద్రబాబు దొరికిపోయారు.  మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ, వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ లంచాల బేరాలు నడిపారు చంద్రబాబు. ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన చంద్రబాబు.. ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు భారీ ఆందోళన చేపట్టి మోదీని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నానా తిట్లు తిట్టారు.

తిరుమల దర్శనానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై రాళ్లు విసిరి వేయించిన ఘనత కూడా చంద్రబాబుదే. ఎవరి వల్ల ఏపీలో అధికారంలోకి వచ్చాడో వాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.., రాహుల్ గాంధీ కోసం ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నం చేశారు.  ఎంతో రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ జీవితమంతా పొత్తుల తక్కెడపైనే సాగడం విడ్డూరంగానే ఉన్నా ఒప్పుకోక తప్పదు కదా మరి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement