సార్ రూల్స్ పెడతారు.. ఆయన పాటించరు
కొందరు టీడీపీ నేతలకు మాత్రమే రూల్స్ పెట్టిన చంద్రబాబు
చంద్రబాబు ఎప్పుడూ అంతే.. రూల్స్ పెడతారు.. తానుమాత్రం పాటించరు.. కేడర్‌కు, ప్రజలకు.. అధికారులకు బోలెడు నీతులు చెబుతారు.. కానీ తనకు మాత్రం అవేం వర్తించవు. ఆయన అన్నింటికీ అతీతుడు.. ఆయనకు మకిలి అంటదు.. సూర్యుడు మరి. ఇక పార్టీకి సంబంధించి సీట్లు ఇచ్చే విషయంలో కూడా ఆయన చాలా రూల్స్ పెట్టారు. కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని గట్టిగా ప్రకటించారు కానీ.. కిందన మాత్రం చిన్న అక్షరాలతో కొందరికి మాత్రం ఈ రూల్స్ వర్తించవు అని రాస్తారు.
కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే అనే రూల్ పెట్టి కొన్ని కుటుంబాలకు చెక్ పెట్టిన చంద్రబాబు ఇంకొన్ని కుటుంబాలకు మాత్రం రెండు.. మూడేసి సీట్లు ఇచ్చారు. పరిటాల సునీతకు రాప్తాడులో మాత్రమే ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన బాబు.. ఆమె కొడుకు శ్రీరామ్‌కు ధర్మవరం టికెట్ నో అన్నారు. ఎందుకు అని అడిగితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరేసి పోటీ చేస్తే ఎలా? మిగతా వాళ్లకు కూడా ఛాన్స్ రావాలి కదా అన్నారు.
దీంతో ఆ ఫ్యామిలీ ఒక టికెట్‌తో సరిపెట్టుకుంది. అయ్యన్నపాత్రుడు కూడా నర్సీపట్నం ఎమ్మెల్యే టిక్కెట్‌తో సైలెంట్ అయ్యారు. కొడుకు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించినా కుదరలేదు. ఆ ఎంపీ టిక్కెట్ కాస్తా బీజేపీ కోటాలో సీఎం రమేష్‌కు దక్కే అవకాశాలు ఉన్నాయి. జేసీ బ్రదర్స్ కుటుంబంలో అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టిక్కెట్ ఇచ్చి ఊరుకున్నారు. మరి జేసీ దివాకర్.. ప్రభాకర్‌లకు ఇద్దరికీ టిక్కెట్లు లేవని చెప్పేశారు.
ఇక అక్కడితో సీన్ కట్ చేసి రెండో స్క్రీన్ ఓపెన్ చేస్తే అన్నీ ఫ్యామిలీ ప్యాకులే కనిపిస్తాయి. చంద్రబాబు కుటుంబంలో మొత్తం నలుగురు పోటీలో ఉన్నారు. చంద్రబాబు కుప్పంలో.. లోకేష్ మంగళగిరిలో.. బాలయ్య హిందూపురంలో.. బాలయ్య చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం రూల్స్ గట్రా లేవని చెప్పేశారు.
► యనమల రామకృష్ణుడు ఫ్యామిలీలో కూడా యనమల కూతురు- తుని (అసెంబ్లీ), యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్- మైదుకూరు(అసెంబ్లీ), యనమల అల్లుడు, పుట్టా మహేష్ యాదవ్- ఏలూరు (పార్లమెంట్) ఇంకా యనమల ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
► కింజరపు ఫ్యామిలిలో బాబాయ్ అచ్చం నాయుడు టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా అబ్బాయి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన చెల్లెలి భర్త, బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మొత్తం ఆ ఇంట్లో మూడు టిక్కెట్లు తీసుకున్నారు.
ఇక వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీగా ఛాన్స్ ఇవ్వగా ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. ఇలా చంద్రబాబు రూల్స్ పెడతారు. తనకు నచ్చిన వాళ్ళ కోసం వాటిని బ్రేక్ చేస్తారుంటూ టీడీపీలోనే గుసుగుసలాడుకుంటున్నారు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment