సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు అటు లోక్‌సభలోకూడా తీవ్ర దుమారాన్ని రాజేసాయి. తాజాగా ఈ సెగ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌ను కూడా తాకింది. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదుసార్లు తాను ఫోన్లు మార్చానని, అయినా ఇప్పటికీ హ్యాకింగ్ కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు.
ఇజ్రాయెల్ స్పైవేర్ 'పెగసాస్' టార్గెట్ చేసిన ప్రముఖుల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఉండటం గమనార్హం. ది వైర్ నివేదిక ప్రకారం ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను కేంద్రం హ్యాక్ చేసింది. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని, అలాగే జూలై 14 చివరిసారి ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశీయంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమున్నాయి.ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 300 మంది భారతీయుల ఫోన్లను ట్యాపింగ్ చేయగా, ఇందులో 40 మంది ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు సమాచారం. వైష్ణవ్ ఆయన భార్య పేరుతో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ల చివరి అంకెలు బహిర్గతమైన రికార్డుల్లో కన్పిస్తున్నాయని వైర్ తెలిపింది.
2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ అధికారం చేపట్టేందుకు ప్రచార వ్యూహకర్తగా కిశోర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తరువాత బీజేపీ వ్యతిరేక పార్టీలకే పనిచేస్తూ వచ్చారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో విజయం సాధించడంలో పీకే కృషి చాలా ఉంది. కాగా ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆర్ఎస్ఎస్ నేతలు,జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చర‍్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఎన్ఎస్ఓ గ్రూప్, పెగాసస్ మాలావేర్ క్లయింట్ల జాబితాలో ఉన్న పది దేశాలలో భారతదేశం ఒకటి
Comments
Please login to add a commentAdd a comment