సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. భేటీ అనంతరం వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. సమావేశాల్లో పలు అంశాలపై ఎలా స్పందించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. తాము ఏ కూటమిలో లేమని, తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ చెప్పారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను నిలబెట్టేలా పార్లమెంటులో వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు.
పోలవరం నిర్మాణ ఖర్చు రూ. 55 వేల కోట్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయ ప్రాజెక్టులో సాగునీరు, విద్యుత్ కలిపి చూడాలని కొరతామని, జోనల్ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి లేవనెత్తిన 6 అంశాలు పార్లమెంట్‌లో గళమెత్తుతామని చెప్పారు. ఆహార భద్రత చట్టం ద్వారా ఏపీకి అన్యాయం జరుగుతోందని, దాన్ని ఉభయసభల్లో లేవనెత్తుతామని.. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. వరద బాధితులకు తాత్కాలికంగా రూ.1000 కోట్లు కావాలని సీఎం జగన్ కోరారని పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడతామని తెలిపారు.
బీసీ జనగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, దాన్ని కూడా కేంద్రంతో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని, దాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు గట్టిగా కృషి చేస్తామని అన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం రూ.30 వేల కోట్ల కోసం పోరాడతామని, ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నాని చెప్పారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
చదవండి: ‘ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం’
Comments
Please login to add a commentAdd a comment