ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకే నెలలో రెండోసారి ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం వెనకున్న ఆంతర్యాలను ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలున్నా గత ఏడేళ్లలో ఎప్పుడూ.. ఒకే నెలలో రెండుసార్లు సీఎం ఢిల్లీలో పర్యటించలేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జల వివాదాల నేపథ్యంలో కేసీఆర్ హస్తిన ప్రయాణం ప్రాధాన్యత సంతరించుకుంది.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరుకానున్న సీఎం.. తర్వాత జరిగే బీఏసీ భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరగనున్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి సమీక్షకు హాజరు కానున్నారు. అదే రోజు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయి ధాన్యం కొను గోలు అంశాలపై చర్చించనున్నారు. అదివారం సాయంత్రం సీఎం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి.
తొలి వారంలో మొదటిసారి
ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఉన్న ఎనిమిది రోజుల్లో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడంతో పాటు ఇతర కార్య క్రమాలతో బిజీ బిజీగా గడిపారు. జాతీయ రాజకీ యాలపై, ఆర్థిక వ్యవస్థ గురించి తనను కలిసిన వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తీసుకు న్నారు. ఇలా సీఎం ఏకంగా ఎనిమిది రోజుల పాటు ఢిల్లీలో గడపడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా మూడు రోజుల పర్యటన చేపట్టడం కూడా చర్చకు దారితీసింది.
తొలిసారి హోం శాఖ సమీక్షకు..
దేశ వ్యాప్తంగా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఏటా కేంద్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. ఇదే క్రమంలో ఈనెల 26న ఈ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్, రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ అదనపు డీజీపీ అనిల్‌కుమార్ హాజరుకానున్నారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో మావోయిస్టుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం ఉండగా, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు తక్కువ ప్రాబల్యం కల్గిన జిల్లాలుగా కేంద్ర హోంశాఖ గుర్తించింది.
ఆయా జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ కింద ఏటా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, వివిధ పథకాల ద్వారా అక్కడి నిరుద్యోగ యువతకు ఆర్థిక తోడ్పాటు కల్పించడం ద్వారా వారు మావోయిజం వైపు ఆకర్షితులవ కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా గడిచిన ఐదేళ్లలో కేంద్ర హోంశాఖ మూడు విధాలుగా నిధులు మంజూరు చేస్తూ వస్తోంది.
మరిన్ని నిధులు కోరనున్న సీఎం
భద్రత సంబంధిత వ్యయం (ఎస్‌ఆర్‌ఈ), ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన పథకం (ఎస్‌ఐఎస్), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్‌సీఏ) కింద మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్ల ఏర్పాటు, బ్యాంకులు, పోస్టాపీసుల ఏర్పాటు వంటివి కేంద్రం చేపడుతోంది. వీటితో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు వాటి ద్వారా ఉద్యోగాల కల్పనకు, విద్యాసంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తూ వస్తోంది.
రాష్ట్రానికి ఎస్‌ఆర్‌ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి 2021 వరకు రూ.42.06 కోట్ల నిధులును కేటాయించింది. అదే విధంగా ఎస్‌ఐఎస్ పథకం కింద రూ.13.12 కోట్లు, ఎస్‌సీఏ కింద రూ.85.92 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు కావడాన్ని ప్రస్తావిస్తూ వాటి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా అమిత్‌షాను సీఎం కోరనున్నట్టు తెలిసింది. ఈ మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో నిరుద్యోగ యువ తకు ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు సంబంధిత అంశాలపై సీఎం ప్రతిపాదనలు సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment