డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా సురేఖతో కలిసి వేదికపైకి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
అంబానీ, అదానీలను తలదన్నేలా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఇందిరమ్మ పేరిట మహిళలకు సంక్షేమ పథకాలు అందించి, ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం. ఇందులో భాగంగా తెలంగాణలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. అంబానీ, అదానీలను తలదన్నే రీతిలో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం. వరంగల్ ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాన్ని ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
నాడు టీపీసీసీ చీఫ్‌గా, నేడు సీఎంగా మహిళలు నిండు మనసు, ఆశీస్సులతో ఆదరించడం వల్లే ఓరుగల్లు వేదికపై తామంతా నిలబడగలిగామని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మహిళా లోకం ఓటు ద్వారా బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రజాపాలనకు బాసటగా నిలిచిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి మధ్యాహ్నం కాళోజీ కళాక్షేత్రానికి వచ్చిన సీఎం.. తొలుత ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్‌గా రూ.4,684.37 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం (ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట
‘2014 నుంచి 2019 వరకు బీఆర్‌ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రిగా లేరు. గత ఎన్నికల్లో తెలంగాణ మహిళలు ఇచ్చిన తీర్పుతో మేం మెుదటి మంత్రివర్గంలోనే కొండా సురేఖ, సీతక్కకు మంత్రులుగా అవకాశం కల్పించాం. ఈ సభా నిర్వహణ కార్యక్రమాన్ని సైతం వారి చేతుల్లోనే పెట్టాం. వరంగల్ నియోజకవర్గం నుంచి కడియం కావ్యను పార్లమెంటుకు పంపించాం. పాలకుర్తిలో ఓ రాక్షసుడు రాజ్యమేలుతుంటే యశస్వినిరెడ్డి అనే సోదరి ఆ రాక్షసుడిని ఎన్నికల్లో ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.
తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఆడబిడ్డనే. పలు జిల్లాలకు కలెక్టర్లుగా మహిళలే ఉన్నారు. వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా ఓ మహిళే ఉన్నారు. మహిళల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. మహిళా సంఘాల స్టాల్స్ చూస్తుంటే కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీ వ్యవస్థలను అధిగమించేలా కనిపిస్తోంది. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు వారికి సౌర విద్యుత్ ఉత్పాదక రంగాలను అప్పగిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆ సభతో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయ్
‘తెలంగాణ వాదానికి, పౌరుషానికి మరో పేరైన కాళోజీని గుర్తించని ప్రపంచం, కవులు లేరు. అలాంటి కాళోజీని స్ఫూర్తిగా తీసుకుని వరంగల్‌లో రాహుల్‌గాం«దీతో రైతు సంఘర్షణ సభ నిర్వహించాం. ఆ సభలో రైతు డిక్లరేషన్ ఇచ్చి ఆచరణలో అమలు చేస్తున్నాం. ఆ సభతోనే తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయాయి. ప్రశ్నించే గొంతుకకు ప్రతీకైన కాళోజీ కళాక్షేత్రాన్ని పదేళ్లలో పూర్తి చేయలేకపోవడంలోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతగానితనం వెలుగు చూసింది. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఒత్తిడితో మేం కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసి ప్రారంభించాం..’ అని రేవంత్ చెప్పారు.
వరంగల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
‘వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు ధీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌కు పోటీ నగరంగా తీర్చిదిద్దుతాం. వరంగల్ అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణ రూపురేఖలే మారతాయి. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల పురోగతి ఓరుగల్లు అభివృద్ధితో ముడిపడి ఉంది. మహారాష్ట్రలో బస్సు డిపోల మాదిరిగా ఎయిర్‌పోర్టులు ఉన్నా తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఎక్కడా లేవు. అందుకనే వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తే ఊచలు లెక్కబెడతారు..’ అని సీఎం అన్నారు.
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనీయం
‘కేసీఆర్ నువ్వు ఫామ్‌హౌస్‌లో పడుకుంటే, మౌనంగా ఉండి కుట్రలు చేస్తే నీ గురించి తెలవదనుకోకు.. నాకు ముందు తెలుసు.. వెనక తెలుసు.. ఉపాయం తెలుసు.. ఉబలాటం తెలుసు.. అన్నింటికీ కుక్కకాటుకు చెప్పుదెబ్బలా నీ సంగతి తేలుస్తా.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ తెలంగాణలో మొలకెత్తనీయం.. రాసి పెట్టుకోండి.. కేసీఆర్ కాస్కో చూద్దాం. అధికారం ఉంటే దోచుకుంటవ్.. ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో పడుకుంటవా? మళ్లీ చెబుతున్నా.. రా బయటకు.. ప్రజల్లోకి వచ్చి మాట్లాడు.. నీ దుఃఖం ఏందో.. నీ బాధ ఏందో దమ్ముంటే అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం.. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైతే సరిచేసుకుంటాం..’ అని రేవంత్ చెప్పారు.
బిల్లా రంగాలవి అర్థం పర్థం లేని విమర్శలు
‘మీరు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలనుకున్నారు. తాగుబోతుల సంఘానికి గౌరవాధ్యక్షుడు ఎవరంటే అది కేసీఆరే. కేసీఆర్.. మీరు ఫామ్‌హౌస్‌లోనే ఉండండి.. కావలసినవి అక్కడికే పంపిస్తా. అసెంబ్లీకి రమ్మంటే అచ్చోసిన ఆంబోతుల్లా ఇద్దరిని రోడ్ల మీదకు వదిలేసినవ్.. రుణమాఫీ చేయలేదంటూ ఆ బిల్లా రంగాలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే వారైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధం కావాలి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ కార్మికులతో ధర్నా చేయించిన కేటీఆర్.. కాకి అంగీ వేసుకుంటే ఆటోరాముడు అవుతావా? నువ్ రామారావువా? డ్రామారావువా?..’ అని సీఎం ఎద్దేవా చేశారు
తెలంగాణ ద్రోహి మోదీకి కిషన్‌రెడ్డి గులాంగిరీ
‘ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ద్రోహి. అలాంటి మోదీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గులాం గిరీ చేస్తున్నారు. ఆ ద్రోహికి ఊడిగం చేసే కిషన్‌రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు. కేటీఆర్ ఏదన్నా మాట్లాడగానే రెండోరోజు కిషన్‌రెడ్డి మాట్లాడతడు. అది మీకున్న బాండింగ్. నీకు ఉద్యోగం ఇచ్చింది నరేంద్రమోదీ కాదు.. సికింద్రాబాద్ ప్రజలు. ఆ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు. మేం సోనియమ్మకు గులాం గిరీ చేస్తున్నం అని కిషన్‌రెడ్డి మాట్లాడుతుండు. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియమ్మ.. నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలకు అమ్మ. అలాంటి ఆ తల్లి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి కూడా మేం సిద్ధమే. ఇది మాకు అవమానం కాదు.. ఆత్మ గౌరవం. కిషన్‌రెడ్డి..సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకుంటే మోదీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది..’ అని రేవంత్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment