కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ల డ్రామా: సీఎం రేవంత్
కవిత అరెస్టుపై ఆమె తండ్రి, పార్టీ
అధ్యక్షుడు కేసీఆర్ మౌనం ఎందుకు?
ప్రధాని కూడా దీనిపై మాట్లాడరేంటి?
అరెస్టు సానుభూతితో బీఆర్‌ఎస్.. అవినీతిని సహించబోమంటూ బీజేపీ ఓట్లు దండుకునే యత్నం
తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి..
ప్రధానిగా మోదీ చౌకబారు విమర్శలు చేయడం మంచిది కాదు
మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. తెల్లారేసరికి వారి పక్కన ఎవరూ ఉండరు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఓ ఎన్నికల స్టంట్ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ టీవీ సీరియల్‌లా సాగదీసి, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు అరెస్టు చేయడం కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీసే డ్రామాయేనని ఆరోపించారు. అరెస్టు సానుభూతితో బీఆర్‌ఎస్, అవినీతి వ్యతిరేకుల మని చెప్పుకొంటూ బీజేపీ ఓట్లు దండుకునేందుకు చేస్తున్న ప్రయత్నమిదని విమర్శించారు. కవిత తండ్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏమీ స్పందించకపోవడం, ప్రధాని మోదీ కూడా మౌనం పాటించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ తన నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, డాక్టర్ రోహిణ్‌రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే..
‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ చట్టసభల్లో మాట్లాడిన ప్రధాని మోదీకి తెలంగాణ పేరు పలికే అర్హత లేదు. గత పదేళ్లలో విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మేం కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ఆదేశించాం.
మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. కానీ అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదు. భాష గురించి మాజీ సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయమైంది. కేసీఆర్ అసెంబ్లీలో ఉత్తమ్‌ను ఉద్దేశించి ఏం మాట్లాడారో, మొన్న నల్లగొండ సభలో ఎన్ని మాటలు మాట్లాడారో సోషల్ మీడియాలో వస్తోంది చూడమనండి.
మా ప్రభుత్వాన్ని పడగొడతారా?
ప్రజాప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్‌ఎస్, బీజే పీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ ఆలోచన చేస్తే.. వారు నిద్రలేచేసరికి వారి పక్కన ఎవరూ ఉండరు. ఆఖరికి బట్టలు కూడా ఉండవు. మీరు పడగొట్టాలని అనుకుంటే.. నిలబెట్టేందుకు మా ప్రయత్నం మేం చేస్తాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నన్ను కలుస్తున్నారు. ప్రజాప్రభుత్వాన్ని పడగొడతా మని కొందరంటున్నారు, మరికొందరు మాకు అండగా నిలబడతామని చెప్తున్నారు. మేం ఫిరాయింపులను ప్రోత్సహించం. ప్రతిపక్ష పాత్ర కాకుండా ప్ర భుత్వాన్నిపడగొడతామంటే.. మా తడాఖా చూపిస్తాం. ఇది అభద్రతా భావంతో చెప్తున్నది కాదు.
మా పాలనకు రెఫరెండం..
బీఆర్‌ఎస్, బీజేపీల పదేళ్ల పాలనకు, వందరోజుల మా పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం. మేం చేస్తున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చూపి ఓట్లు అడుగుతాం..’’అని రేవంత్‌రెడ్డి చెప్పారు. టానిక్ మద్యం వ్యాపారంలో తీగలాగుతున్నామని.. దొరలు, పెద్దలంతా బయటకు వస్తారని, వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మోదీ, ఈడీ కలసి వచ్చారు
ఎన్నికల సమయంలో సాధారణంగా ఈడీ, సీబీఐ ముందు వస్తే తర్వాత మోదీ వచ్చేవారు. కానీ కవిత కేసులో ఇద్దరూ ఒకేసారి వచ్చారు. మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా మౌనం దాల్చడం రాజకీయ లబ్ధి తప్ప మరొకటి కాదు. బీఆర్‌ఎస్, బీజేపీల నాటకాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్ దోచుకుంటుందంటూ మా ప్రభుత్వంపై చౌకబారు ఆరోపణలు చేయడం ప్రధాని మోదీ స్థాయికి తగదు.
దళిత ఉప ముఖ్యమంత్రి భట్టిని తక్కువ ఎత్తు పీటపై కూర్చోబెట్టడం అవమానించడమేనంటూ, గతంలో అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందంటూ ప్రధాని మోదీ మాట్లాడటం దారుణం. అసలు దళితులను రాష్ట్రపతిని, సీఎంలను చేసినదే కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు దళితుడే. ఈ విషయాన్ని మోదీ గుర్తించుకోవాలి.
వంద రోజుల పాలన పూర్తి సంతృప్తినిచ్చింది
రాష్ట్రంలో వందరోజుల పాలన పూర్తి సంతృప్తినిచ్చింది. ‘మార్పు కావాలి–కాంగ్రెస్ రావాలి’నినాదం, 6 గ్యారంటీలను చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఆ మార్పు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వందేళ్లకు సరిపడా విధ్వంసం చేస్తే.. దానిని చక్కదిద్దేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాంటి హంగూ ఆర్భాటాలకు వెళ్లకుండా ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరిస్తున్నారు. సీఎం దర్శన భాగ్యమే కలగని రోజుల నుంచి సీఎం, మంత్రులంతా ప్రజల్లోనే ఉండే మార్పు వచ్చింది.
విజ్ఞులు, మేధావులు, కళాకారులతో కలసి, వారి ఆలోచనలను తెలుసుకుంటూ పాలన సాగిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఇప్పటివరకు 26 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాం. రూ.500 సిలిండర్‌ను 8 లక్షల మంది వినియోగించుకున్నారు. 37 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. పారదర్శక పాలన అందిస్తున్నాం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చాం. కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతూ పెండింగ్ పథకాలకు అనుమతులు తెచ్చుకుంటున్నాం. పొరుగు రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకోదలుచుకోలేదు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment