అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిస్తా: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On BRS leaders about Musi River Issue | Sakshi
Sakshi News home page

అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిస్తా: సీఎం రేవంత్‌

Published Sat, Nov 9 2024 4:24 AM | Last Updated on Sat, Nov 9 2024 4:24 AM

CM Revanth Reddy Fires On BRS leaders about Musi River Issue

‘మూసీ’ ప్రక్షాళనపై ఆగేదే లేదు.. లేకుంటే పేరు మార్చుకుంటా మూసీ పునరుజ్జీవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక

ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది 

అడ్డుపడతామన్న వాళ్లు ధైర్యముంటే తేదీ చెప్పండి.. 

మీరు నాతో కలిసి రాకపోతే రాయికట్టి మూసీలో ముంచుడే 

మూసీ నది అణుబాంబుకంటే ప్రమాదకరంగా తయారైంది 

నల్లగొండ బిడ్డల కాళ్లు వంకరపోతే కేసీఆర్‌కు పట్టడం లేదా? 

ఈ పాపం తగలక తప్పదు.. ప్రజలు మూసీలో పాతరేస్తారు 

ప్రధాని మోదీ సబర్మతి, గంగా నదిని ప్రక్షాళన చేస్తే గొప్పదా? 

మేం మూసీ ప్రక్షాళన చేస్తే నకిలీ బీజేపీ లీడర్లకు గిట్టడం లేదా? 

మూసీ ప్రక్షాళన కోసం ఈ రోజు సంకల్పం తీసుకున్నా.. 

ఇది తన జన్మ దినం కాదు.. జన్మధన్యమైన రోజు అని వ్యాఖ్య 

30 రోజుల్లో మూసీ ప్రాజెక్టు డిజైన్లను పూర్తి చేస్తామని వెల్లడి

మూసీ పునరుజ్జీవాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. నాతో కలసిరాకపోతే రాయి కట్టి మూసీలో వేస్తా. బుల్డోజర్లకు అడ్డుపడతామంటున్న వాళ్లు.. వాళ్ల పేర్లు ఇవ్వండి. మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపైకి బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటా. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లారంగాలు ధైర్యముంటే తారీఖు చెప్పండి. మా వెంకన్న (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి)తో బుల్డోజర్‌ నడిపిస్తా. మా ఎమ్మెల్యే సామెల్‌తో జెండా ఊపిస్తా. ప్రధాని మోదీ సబర్మతి, గంగా నదులను బాగు చేసుకోవచ్చుగానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా? నకిలీ బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. 
– సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, యాదాద్రి: ‘‘మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ట్రైలర్‌ మాత్రమే. అసలు సినిమా ముందుంది. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్‌ చార్మినార్‌ వరకు పాదయాత్ర చేస్తా. బిల్లా రంగాలు, చార్లెస్‌ శోభారాజ్‌లు కలిసి రావాలి. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం. సంగెం శివయ్య సంకల్పంతో మూసీ నదిని ప్రక్షాళన చేసి పునరుజ్జీవింపజేస్తాం’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం సమీపంలో మూసీ నది వద్ద పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మూసీ పునరుజ్జీవ సభలో ప్రసంగించారు. వివరాలు సీఎం రేవంత్‌ మాటల్లోనే.. 

‘‘ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ నది.. ఇప్పుడు మురికికూపంగా మారి విషాన్ని చిమ్ముతోంది. పాలకులు పగబట్టారా? లేక దేవుడు శాపంపెట్టాడా అని మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. మూసీని పునరుజ్జీవింపజేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మూసీ పునరుజ్జీవనం కోసం మంచి సంకల్పం తీసుకున్నాను. ఇది నా జన్మదినం కాదు.. ఇక్కడికి రావడంతో నా జన్మధన్యమైంది. 

ఇక్కడ బతికే పరిస్థితి లేదు.. 
సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ ప్రక్షాళన వద్దంటే చరిత్రహీనులుగా మిగులుతారు. మూసీ కాలుష్యంతో ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడి చెరువుల్లో చేపలు బతికే పరిస్థితి లేదు. ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు. చివరికి ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది. 40 ఏళ్ల క్రితం వరకు స్వచ్ఛమైన నీరు పారిన మూసీ నది వెంట పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇప్పుడు భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 

ప్రజలకు వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోంది. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఒక్కసారి ఆలోచించండి. బీఆర్‌ఎస్‌ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదు. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారు. బిల్లారంగాలు ప్రజలవైపు ఉంటారో, లేదో తేల్చుకోవాలి. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టులకు సీఎంగా ధన్యవాదాలు చెప్తున్నాను. 


ఆ పాపం తగలక తప్పదు! 
కేసీఆర్‌.. నీ బిడ్డ మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే.. మూసీ పరీవాహక ప్రాంతాల బిడ్డల కాళ్లు చేతులు వంకర పోతుంటే నీకు పట్టదా? నీకు పాపం తగలక తప్పదు. నువ్వు కుక్కచావు చస్తావ్‌ కేసీఆర్‌. నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్‌.. మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్‌. నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు. నాకు డబ్బులు కావాలంటే నల్లగొండ జిల్లానే కావాలా? నువ్వు తెచ్చిన ధరణిలో అబ్రకదబ్ర చేస్తే కోట్లాది రూపాయలు రావా? మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది. ప్రక్షాళన చేయకపోతే నా జన్మ ఎందుకు? 

అణుబాంబు కంటే ప్రమాదం  
మూసీ ప్రాంతాల్లో మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదు. ఒకవేళ గర్భం దాల్చినా అంగవైకల్యంతో పిల్లలు జన్మిస్తున్నారు. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరంగా మూసీ నది తయారైంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ అతిపెద్ద విస్ఫోటనాన్ని మూసీ రూపంలో ఎదుర్కోబోతోంది. మూసీ కాలుష్యం వల్ల ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండే పరిస్థితి లేదు. గోదావరిని మూసీతో కలిపి మూసీ, ఈసీ వాగులను కృష్ణాతో అనుసంధానించే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లను పూర్తి చేస్తాం..’’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

సీఎం రేవంత్‌ పర్యటన, యాత్ర ఇలా.. 
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో మూసీపై ఉన్న సంగెం–»ొల్లెపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తొలుత మూసీ ఒడ్డున ఉన్న భీమలింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మూసీ పక్షాళన చేస్తానని సంకల్పం తీసుకున్నారు. మూసీ తీరం వెంట నడుచుకుంటూ వస్తూ నదిలో పారుతున్న నీటిని ఒక బాటిల్‌లోకి తీసుకున్నారు. బోటులో ఎక్కి నదిలో కొద్దిదూరం ప్రయాణం చేసి నీటిని పరిశీలించారు. 

ఒడ్డుకు చేరుకున్నాక సంగెం గ్రామం వైపు నుంచి బ్రిడ్జి మీదుగా భీమలింగం కత్వ వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మత్స్యకారులు, రైతులు, వివిధ వర్గాల వారితో మాట్లాడారు. రూ.రెండు కోట్లతో సంగెం వద్ద ఉన్న భీమలింగశ్శ్వర ఆలయం వద్ద అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తిరిగి సంగెం గ్రామ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, మందుల సామేల్‌ తదితరులు పాల్గొన్నారు.  

కేటీఆర్‌ మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి: తప్పుచేసినవారు ఎంతటి వారైనా జైలుకెళ్లాల్సిందేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవన సభలో ఆయన మాట్లాడారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధిలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని.. ఆ పార్టీల నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

తనను జైలుకు పంపిస్తే యోగా చేసి, పాదయాత్ర చేస్తానని కేటీఆర్‌ చెప్తున్నారని.. కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి పదేళ్లు సమయం ఇచ్చినా మూసీని ప్రక్షాళన చేయలేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవనం ఆరేళ్ల ప్రాజెక్టు అని.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, రేవంత్‌రెడ్డినే తిరిగి సీఎం అవుతారని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement