లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ త్వరలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పర్యటనలతో ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
రాష్ట్రంలో ఇక పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యం వహించనున్నారు. మధుర నుంచి కాషాయ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే ప్రారంభం కానున్న ఈ ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ పార్టీ ఓటర్లకు చేరువ కావడంలో చురుకైన పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది.
మార్చి 27 నుండి ప్రారంభమయ్యే ప్రబుద్ధ వర్గ సమ్మేళనానికి సీఎం యోగి నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఆయన శ్రేణులకు వివరిస్తారు. వివిధ ప్రాంతాలలో ప్రతిరోజూ మూడు సమ్మేళనాలు జరగనున్నాయి. మార్చి 27న మీరట్, ఘజియాబాద్‌ల సందర్శనల తర్వాత, మార్చి 28న బిజ్నోర్, మొరాదాబాద్, అమ్రోహాలో సమావేశాలను ప్రతిపాదించారు.
మార్చి 29న షామ్లీ, ముజఫర్‌నగర్, సహరాన్‌పూర్, మార్చి 30న బాగ్‌పత్, బులంద్‌షహర్, గౌతమ్ బుద్ధ నగర్, మార్చి 31 బరేలీ, రాంపూర్, పిలిభిత్‌లలో పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల పర్యటించారు. అజంగఢ్ నుండి దేశవ్యాప్తంగా రూ. 42,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment