ఇదీ మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌: సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Comments At Piduguralla Memantha Siddham Sabha | Sakshi
Sakshi News home page

ఇదీ మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌: సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Apr 11 2024 4:18 AM | Last Updated on Thu, Apr 11 2024 7:48 AM

CM YS Jagan Comments At Piduguralla Memantha Siddham Sabha - Sakshi

2.31 లక్షల ఉద్యోగాలు, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం.. చంద్రబాబు హయాంలో కేవలం 32 వేల ఉద్యోగాలే 

పిడుగురాళ్ల సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

చంద్రబాబు, పచ్చమీడియా కుట్ర రాజకీయాల్లో నిజాల నిగ్గు తేలుద్దాం 

వారు చెప్పే అబద్ధాలు, మోసాలపై జాయింట్‌గా నిజ నిర్దారణ చేద్దాం  

వ్యవసాయం దండగన్న ఏకైక సీఎం బాబే 

ఉచిత విద్యుత్‌ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది ఈ పెద్దమనిషే 

రైతులను విచారించేందుకు కోర్టులు ఏర్పాటు చేసింది కూడా ఈయనే 

2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీ అయినా నెరవేర్చారా? 

మన 58 నెలల పాలనలో ప్రతి రైతుకు రూ.67,500 ఇచ్చాం 

వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌.. ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాం 

ప్రతి ఊళ్లోనూ విప్లవాత్మక మార్పులు 

మొన్నటిదాకా వలంటీర్లపై చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎన్ని మాటలన్నారు? 

వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని బాబు చెప్పడం మన ప్రభుత్వానికి గొప్ప సర్టిఫికెట్‌.. 

గాలి ఎదురు తిరిగిందని ఊసరవెల్లిలా రంగులు మార్పు

నిమ్మగడ్డతో ఫిర్యాదు చేసి అవ్వాతాతల మరణానికి కారణమైంది మీరు కాదా? 

నీకు అధికారమిస్తే జన్మభూమి కమిటీలను వలంటీర్లుగా తెస్తావని అందరికీ తెలుసు  

ఊసరవెల్లి ఎన్నిసార్లు రంగు మారుస్తుందో నాకు తెలియదు గానీ, చంద్రబాబు మాత్రం ఊసరవెల్లిని దాటిపోయాడు. నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్ట మొదటిగా ఈ వలంటీర్లను పీకేస్తావు. మళ్లీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందర్నీ వలంటీర్లుగా తెచ్చుకుంటావు. వాళ్లు దోచుకునే దాని కోసం రూ.10 వేలు అదనంగా వాళ్లకు ఇస్తావు. ఇదీ నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలే పునాదులు, మోసాలే. వెన్నుపోట్లే చరిత్ర. సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్‌ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్‌ కిందనే గుర్తుకొస్తుంది. 

సిద్ధం.. సిద్ధం.. అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలా వినిపిస్తుంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఏ పేదకు ఏ మంచి చేయని పెత్తందార్ల గుండెల్లో యుద్ధం.. యుద్ధం అని ప్రతిధ్వనిస్తోంది. వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పేద వాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను మనమంతా ఒక్కటై తిప్పికొడదాం. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి కొనసాగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. ప్రజలందరూ  మోసపోతారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబు గుణగణాలు ఎలా ఉంటాయంటే.. ఎన్నికలకు ముందు గంగ. అధికారం దక్కిన తర్వాత లక లకా.. అంటూ పేదల రక్తం తాగే చంద్రముఖి. 

మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతున్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం.. ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా.. లేక మోసపోయి అంధకారంలోకి వెళ్లాలా అన్నది నిర్ణయించే ఎన్నికలని కూడా గుర్తుంచుకోవాలి. దీనిపై మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని చర్చించాలి. మనం వేసే ఓటుతో మన తలరాతలు మారతాయని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌ది పేదల పక్షం.                                               
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉద్యోగాలివ్వడంలో.. రైతులు, మహిళల అభ్యున్నతికి కృషి చేయడంలో, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ఇస్తున్నది బోగస్‌ రిపోర్టు అయితే, వైఎస్‌ జగన్‌ ఇస్తున్నది కళ్లెదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్‌ రిపోర్టు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మనందరి ప్రభుత్వ హయాంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహించామని చెప్పారు. మొట్ట మొదటిసారిగా ఎంఎస్‌ఎంఈలకు చేయూతనిచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.


వాహన మిత్ర, నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. ఇలా అన్ని విధాలా ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతోందన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక చక్రం పరుగులు పెడుతోందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన సభలో మాట్లాడారు.

ఈ జన సంద్రాన్ని చూస్తుంటే నెల రోజుల్లోనే పట్టపగలు కోటప్పకొండ తిరునాళ్లు కనిపిస్తోందని అన్నారు. ఐదేళ్ల మన ప్రభుత్వంలో ఇంటింటికీ వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు, వివక్ష లేని పాలనను.. ఆ దుష్ట కూటమి, ఎల్లో మీడియా కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రంగా మారిన దృశ్యం కనిపిస్తోందని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

ఏది నిజం, ఏది అబద్ధం.. మీరే తేల్చండి
► బాబుగారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో నేను కొన్ని నిజానిజాలు తేల్చదల్చుకున్నా. ఈ రోజు ఇక్కడ మీరు, నేను జాయింట్‌ గా ఓ ఫ్యాక్ట్‌ చెక్‌ (నిజ నిర్ధారణ) చేద్దాం. ఈ చంద్రబాబు గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. ఈ చెత్త మీడియా చేస్తున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది మీ ముందు పెడుతున్నా. 
► చంద్రబాబు, ఈ ఎల్లో మీడియా కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వస్తారు. తర్వాత వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. దాన్ని గుర్రం, గుర్రం అంటూ పదే పదే ఊదరగొడతారు. ఇలా 30 ఏళ్లుగా చేస్తూ వస్తున్నారు. 2014లో జాబు రావాలి అంటే బాబు రావాలి అని సభల్లో, టీవీ చానళ్లలో, ఊరూరా ఊదరగొట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీ వాళ్లకు, మీ ఇంటి చుట్టు పక్కల వాళ్లకు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? 

► మీ బిడ్డ జగన్‌ వచ్చాక ప్రతి గ్రామంలో ఒక సచివాలయం తీసుకొచ్చారు. ఆ సచివాలయాల్లో ఏకంగా 1.35 లక్షల మంది మన పిల్లలు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకంగా 80 శాతం మంది ఉన్నారు. 
► ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే ఈ 58 నెలల కాలంలో 54 వేల పోస్టులు భర్తీ చేశాం. గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు వెళితే గతంలో మాదిరి డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్‌ లేరన్న పరిస్థితి లేదు. మొత్తంగా 58 నెలల్లో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మీ బిడ్డ పాలన రాక ముందు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే.. ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ మరో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య కేవలం 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఈ లెక్కన జాబు రావాలి అంటే ఫ్యాను రావాలా? లేక తుప్పు పట్టిన సైకిల్‌ రావాలా?

నిర్మాణంలో 4 సీ పోర్టులు, 3 ఇండస్ట్రియల్‌ కారిడార్లు, 10 నోడ్స్‌
► మరోవైపు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా మరో నాలుగు సీ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ కూడా వేగంగా పరుగులెత్తుతున్నాయి. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నంబర్‌ వన్‌గా నిలుస్తోంది. 

► రైతు అంటే బాబుకు ప్రేమట. నమ్ముతారా? (నమ్మం.. నమ్మం.. అని నినాదాలు) గతంలో ఏమీ చేయని బాబు.. ఇప్పుడు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇదీ వాళ్ల ఎల్లో మీడియా, చంద్రబాబు కొత్తగా చెబుతున్న మాటలు. వ్యవసాయం దండగ అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా  అంటే అది ఈ చంద్రబాబే. రైతులకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు. రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి. ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి. 

బాబువన్నీ విఫల హామీలే
► 2014లో రూ.87,612 కోట్లు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. విడిపించాడా? రైతులకు సున్నా వడ్డీ కూడా ఎగరగొట్టేశాడు. ఇన్‌పుట్‌ సబ్సిడీ సైతం 2017 నుంచి ఎగ్గొట్టేశాడు. కరెంటు విషయంలోనూ బకాయిలే. ధాన్యం సేకరణలోనూ బకాయిలే, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలకు సైతం డబ్బులివ్వకుండా బకాయిలే.  

► మీ బిడ్డ జగన్‌ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 ప్రతి రైతన్న చేతిలో పెడుతున్నాడు. ఈ ఐదేళ్లలో ప్రతి రైతన్నకూ రూ.67,500 ఇచ్చాం. మేనిఫెస్టోలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి, అంతకంటే మిన్నగా రూ.67,500 ఇచ్చామా? లేదా? అని అడుగుతున్నా. పగటిపూటే నాణ్యమై­న 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చాం. ఇందు కోసం రూ.1,700 కోట్లు ఫీడర్లపై ఖర్చు చేశాం.

► రైతన్నను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్బీకే) తీసుకొచ్చి దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలిచాం. ఇ–క్రాప్‌ ద్వారా, ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకూ, ప్రతి ఎకరాకూ, ప్రతి పంటకూ ఇన్సూరెన్స్‌ అందుతోంది. సీజన్‌ ముగిసేలోపు పంట నష్టపరిహారం, విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు తోడుగా ఉన్నాం. రూ.64 వేల కోట్లు ధాన్యం సేకరణకు ఇచ్చాం. మద్దతు ధర దక్కేలా చూస్తున్నాం. గన్నీబ్యాక్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేలు అదనంగా వచ్చేలా చూశాం.

► సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు ఎత్తేస్తే.. మీ బిడ్డ జగన్, బాబు బకాయిలను సైతం కట్టి, మళ్లీ సున్నా వడ్డీకే పంట రుణాలు ఇప్పిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు కల్పించాం. ఈ పరిస్థితిలో రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరం? రుణ మాఫీ అని మోసం చేసిన చంద్రబాబా? లేక వ్యవసాయానికి అండగా నిలబడిన మీ బిడ్డనా? వాళ్లు ఇచ్చేది బోగస్‌ రిపోర్ట్‌. మీ జగన్‌ ఇస్తున్నది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌. 

ప్రతి గ్రామంలో విప్లవం 
► ఈ రోజు ప్రతి గ్రామంలో విప్లవం కనిపిస్తోంది. వలంటీర్ల వ్యవస్థ, 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, హాస్పిటళ్లు కనిపిస్తున్నాయి. 15 వేలకుపైగా విలేజ్, వార్డు క్లినిక్‌లు.. 11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. లంచాలు, వివక్ష లేకుండా 130 సార్లు మీ బిడ్డ బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ పంపించాడు. అమ్మ ఒడి పథకాన్ని మీరెప్పుడైనా చూశారా? పూర్తి ఫీజులు కడుతూ విద్యాదీవెన, వసతి దీవెనకు ఇంతగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా? 

► ఆసరా, సున్నా వడ్డీ ద్వారా పొదుపు అక్కచెల్లెమ్మలను ఆదుకున్నాం. చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో అండగా నిలిచాం. క్వాలిటీ చదువులే లక్ష్యంగా పేద పిల్లల తలరాతలు మార్చేలా మేనమామగా శ్రద్ధ పెట్టాను. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్, 6వ తరగతి నుంచే ఆ ప్రతి క్లాస్‌ రూములో డిజిటల్‌ బోధన, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, టోఫెల్, ఐబీ దాకా ప్రయాణం కనిపిస్తోంది. ఆ బడుల్లో నాడు–నేడు, గోరుముద్ద, విద్యా కానుక గతంలో ఎప్పుడైనా చూశారా? విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్, ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికెట్స్‌ డిగ్రీలకు అనుసంధానం చేశాం. మ్యాండేటరీ ఇంటర్న్‌ షిప్‌ తీసుకొచ్చాం. 

► లీడర్‌ అంటే ఇలా ఉండాలి అని గర్వంగా కాలర్‌ ఎగరేసేలా ప్రజల ప్రేమానురాగాలు పొందుతున్నాం. అదే చంద్రబాబు నాయుడు పేరు చెబితే  గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా? 

ఇంతకన్నా ఇంకేం సర్టిఫికెట్‌ కావాలి?
► ఎప్పుడూ మోసాలు చేసే చంద్రబాబు.. నిన్ననే అనుకుంటా.. కొత్తగా ఒక మాట మాట్లాడాడు. వలంటీర్లకు రూ.10 వేలిస్తాడట. పోనీ ఇట్లన్నా జగన్‌ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. సంతోషం. జగన్‌ పాలన చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దాన్నన్నా ఒప్పుకున్నాడు. మొన్నటి దాకా మన వలంటీర్ల వ్యవస్థ పట్ల భయంకరమైన ద్వేషం వెళ్లగక్కారు. మూటలు మోసే వాళ్లు అన్నాడు. వారి కథ తేలుస్తా అన్నాడు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారని కూడా అన్నాడు.

ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి.. వలంటీర్లు ట్రాఫికింగ్‌ చేయిస్తున్నారని అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్‌ అయిపోతున్నారు.. మాయమైపోతున్నారని కూడా అన్నాడు. వలంటీర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రైవేట్‌ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్‌కు అధికార పెగసస్‌ అని కూడా ట్వీట్‌ చేశాడు ఈ దత్తపుత్రుడు. ఇలా అన్న వాళ్లు వలంటీర్‌ వ్యవస్థను గుర్తించినందుకు సంతోషం. మన ప్రభుత్వానికి ఇంతకన్నా ఏం సర్టిఫికెట్‌ కావాలి?

► అయ్యా చంద్రబాబూ.. నీ హయాంలో జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాళ్లు, మీరు ఇద్దరూ కలిసి మరుగుదొడ్లకూ, రేషన్‌కు, పెన్షన్‌కూ లంచాలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని దోచేశారు. చంద్రబాబు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం.  చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలన్నది జగన్‌ మనస్తత్వం. ఇదీ.. నీకు నాకు మధ్య ఉన్న తేడా.

► ఇదే చంద్రబాబు మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్‌ అనే తన మనిషితో ఎలక్షన్‌ కమిషన్‌ కు కంప్లయింట్‌ చేయించి, అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్‌ను ఆపించారు. ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి, చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమయ్యారు. ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగే సరికే చంద్రబాబులో ఉన్న మోసం మళ్లీ చంద్రముఖిలా పైకి లేచింది. 

ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?
► ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో రాష్ట్ర పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? (సిద్ధమేనని జనం నినాదాలు) మీరు సిద్ధంగా ఉంటే మోసగాళ్ల సోషల్‌ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులోంచి సెల్‌ ఫోన్న్‌ బయటకు తీసి, అందులోని టార్చ్‌ లైట్‌ వెలిగించండి. (అందరూ సెల్‌లో టార్చ్‌ వెలిగించి పైకెత్తి చూపారు). 175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. 

► మన పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులందరికీ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను. మనది ఫ్యాన్‌ గుర్తు అని మరచిపోవద్దు. పేదల భవిష్యత్తు కోసం ఫ్యాను ఎప్పుడూ మన ఇంట్లోనే ఉండాలి. సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ ఎప్పుడూ సింక్‌ లోనే ఉండాలి. మన బతుకులు బాగుపడాలి అంటే ఫ్యాను మీద రెండు ఓట్లు కచ్చితంగా వేయాలి.  

ఒక్కసారి ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళితే..
► 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఇంటింటికీ పంపించిన పాంప్లెట్‌ ఇది. (చేత్తో చూపిస్తూ..) గుర్తుందా ఈ పాంప్లెట్‌? ఇందులో మోడీగారి ఫొటో ఉంది. దత్తపుత్రుడి ఫొటో, చంద్రబాబు నాయుడు ఫొటో ఉంది. కింద చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. ప్రతి టెలివిజన్‌ చాన్‌ల్‌లో వాళ్ల ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ–5లో ఊదరగొడుతూ దీని గురించి అడ్వటైజ్‌ మెంట్లు కూడా ఇచ్చారు. 

► రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేశాడా? మీ ఇంట్లో.. మీ పక్కిళ్లలో 2014–2019 మధ్య ఆడ బిడ్డలు పుట్టారు కదా.. వాళ్లలో ఒక్కరికైనా రూ.25 వేలు ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? 

► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన పిడుగురాళ్లలో కనిపించిందా? పోనీ మన గురుజాలలో అయినా కనిపిస్తోందా?ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్‌ సిక్సు, సూపర్‌ సెవెన్న్‌ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. అవ్వాతాతలకు పెన్షన్‌ రూ.4 వేలు ఇస్తాడట. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్‌ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? 

నేనున్నాననీ..  మీకేం కాదనీ..
ఫిట్స్‌తో స్పృహ తప్పిన మహిళ 
శావల్యాపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. పల్నాడు జిల్లా గంటావారిపాలెం గ్రామ సమీపాన జాతీయ రహదారిపై బుధవారం ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర సాగుతుండగా ఓ మహిళ ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయింది. బొల్లాపల్లి మండలం సరికొండాయపాలెం గ్రామానికి చెందిన మల్లవరపు మౌనిక ఫిట్స్‌తో గత కొన్ని సంవత్సరాలుగా బాధ పడుతోంది. ఈ క్రమంలో తనకున్న వ్యాధి గురించి సీఎం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించిన అనంతరం అభిమానులు, కార్యకర్తల తోపులాటలో ఆమె ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చి రోడ్డుపై పడిపోయింది. విషయాన్ని గమనించిన సీఎం సత్వరమే వైద్యసేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో హుటాహుటిన 108 వాహనం ద్వారా వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడింది.  

అరుదైన వ్యాధిగ్రస్తునికి ఆపన్నహస్తం  
మా 16 ఏళ్ల కొడుకు హుస్సేన్‌ బాషా అరుదైన మల్టిపుల్‌ అటెన్యూయేషన్‌ అసిఫైయింగ్‌ ఫైబ్రామా వ్యాధితో బాధపడుతున్నాడు. ముఖం ఎడమ సగభాగం కన్నుతో సహా ముందుకు వచ్చింది. ఏడాది క్రితం గుంటూరు జిల్లా వడ్లమూడిలోని ఓ ఆస్పత్రిలో హుస్సేన్‌కు రెండు సార్లు సర్జరీలు జరిగాయి. దీనికి అవసరమైన రూ.10 లక్షలు అప్పు చేసి తెచ్చి పెట్టాం. అంత అప్పు తీర్చే పరిస్థితి లేదు. మళ్లీ మా అబ్బాయికి వైద్యం చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరి్థక ఇబ్బందుల నేపథ్యంలో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాం. మా గోడును సీఎం వైఎస్‌ జగన్‌కు చెబుదామని వచ్చాం. మా సమస్య విని సీఎం చలించిపోయారు. తక్షణం వైద్యం అందించేందుకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆరోగ్య శ్రీ అధికారులను ఆదేశించారు. ఆయనకు జీవితాంతం రుణ పడి ఉంటాం.  
 – ఖాదర్‌ అలీ, మౌలాబీ, బాషా తల్లిదండ్రులు కొమ్మాలపాడు, సంతమాగులూరు మండలం   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement