మిమ్మల్నే గెలిపించుకుంటాం | CM YS Jagan Memantha Siddham Bus Yatra in Prakasam district | Sakshi
Sakshi News home page

మిమ్మల్నే గెలిపించుకుంటాం

Published Wed, Apr 10 2024 4:07 AM | Last Updated on Wed, Apr 10 2024 4:07 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra in Prakasam district - Sakshi

నినదిస్తున్న జనం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఊరూరా భరోసా 

సరికొత్త రికార్డులకు వేదికగా నిలుస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 

మండుటెండైనా, అర్ధరాత్రైనా ఉప్పొంగుతున్న అభిమానం

స్కూలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జననేత కోసం ఆరాటం 

దగ్గర నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. సెల్ఫీ దిగేందుకు పోటీ

‘మేలు చేస్తాం.. ఓటు వేయండి’ అనేది మామూలుగా నేతల మాట 

కానీ జనంతో సీఎం వైఎస్‌ జగన్‌ మమేకమవుతున్నప్పుడు తద్భిన్నమైన పరిస్థితులు.. ‘మీ పాలనలో మాకు మంచి జరిగింది.. మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అని జనం హామీ  

రాజకీయాల్లో ఇలాంటి అరుదైన ఘట్టాలు.. ఇదే ప్రథమం అంటున్న రాజకీయ విశ్లేషకులు  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై విశ్వసనీయతకు ప్రతీక అంటున్న విశ్లేషణలు 

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సభలకు కనిపించని జన స్పందన

వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని కొనకనమిట్ల వద్ద ఏప్రిల్‌ 7న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షెడ్యూలు ప్రకారం అక్కడ మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకే సభా ప్రాంగణంలోకి జనప్రవాహం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకే సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఓ వైపు మండుతున్న ఎండ.. మరో వైపు ఉక్కపోత.. అయినా సభా ప్రాంగణం నుంచి లక్షలాది మంది అక్కడి నుంచి కాలు కదపలేదు. 

బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనం పలకడంతో సభా ప్రాంగణానికి సీఎం వైఎస్‌ జగన్‌ కాస్త ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. జననేతను చూడగానే అప్పటిదాకా పడిన ఇబ్బందిని జనం మరిచిపోయి ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ‘ఇంత మేలు చేసిన మీకు కాకుండా ఎవరికి ఓటు వేస్తాం.. మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదే’నంటూ నినాదాలు చేశారు. ఇలా ఎక్కడికక్కడ సీఎం జగన్‌ పట్ల పెరుగుతున్న ఆదరణ సరికొత్త చారిత్రక విజయానికి బాటలు వేస్తోంది.

సాక్షి, అమరావతి: పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడానికి.. చంద్రబాబు వంటి మోసగాళ్ల నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు ‘నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపునిస్తే.. సెల్‌ ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలిగించి ‘మేమంతా సిద్ధం’ అంటూ లక్షల గళాలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాయి. మేమెంతా మీ వెంటేనంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు అడుగులో అడుగు వేస్తున్నారు. ఎక్కడికక్కడ అభిమానం అడ్డుపడుతుండటంతో సీఎం జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్‌ సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది.

ఈ నెల ఒకటవ తేదీన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోకి షెడ్యూలు సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.45 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్ర ప్రవేశించింది. మధ్యాహ్నం 2 గంటలకే నేల ఈనిందా అన్నట్లుగా జనంతో కదిరి కిక్కిరిసిపోయింది. అనంతపురం–మదనపల్లె రహదారిపై సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన రోడ్‌ షోకు అడగడుగునా జనం నీరాజనాలు పలకడంతో కుంభమేళాను తలపించింది. రోడ్‌ షో సాగినంత దూరం సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌లను వెలిగించి జనం సీఎం వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలిపారు. రెండు కిలోమీటర్ల పొడవున రోడ్‌ షో నిర్వహించడానికి 2.10 గంటల సమయం పట్టిందంటే జనం ఏ స్థాయిలో పోటెత్తారన్నది అర్థం చేసుకోవచ్చు. 

అందరి అభిమతం అదే..
వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు ఇప్పటిదాకా సాగిన బస్సు యాత్రలో అడగడుగునా ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కారించాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలాన మేలు చేస్తాం.. మాకు ఓటేయండి.. అని ప్రజలకు నాయకులు హామీలు ఇస్తుంటారు. కానీ.. బస్సు యాత్రలో జనంతో సీఎం వైఎస్‌ జగన్‌ మమేకమైనప్పుడు ‘మీ పాలనలో మాకు మంచి జరిగింది.

మళ్లీ మీరే రావాలి. మిమ్మిల్నే గెలిపించుకుంటాం’ అంటూ యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు హామీలు ఇస్తుండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి మహోజ్వల ఘట్టాలను తామెన్నడూ చూడలేదని.. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయిందనడానికి ఇవే తార్కాణమని విశ్లేషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరో చారిత్రక విజయం సాధించడం ఖాయమనడానికి బస్సు యాత్రలో అడుగడుగునా కన్పిస్తున్న దృశ్యాలే నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టైమ్స్‌ నౌ–ఈటీజీ, జీన్యూస్‌ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థలు డజనుకు పైగా నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని తెగేసి చెబుతుండటం గమనార్హం. 

జైత్ర యాత్రలా బస్సు యాత్ర 
సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ వద్ద మహానేత వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్రను ప్రారంభించారు. వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల మీదుగా ఇప్పటిదాకా బస్సు యాత్ర సాగింది. మండుటెండను లెక్క చేయకుండా స్కూలు విద్యార్థుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు పోటీపడి సీఎం జగన్‌కు సంఘీభావం తెలుపుతున్నారు.

బిడ్డలను చంకనేసుకుని సీఎం జగన్‌ను చూసేందుకు బస్సు వెంట యువతీ యువకులతో పోటీపడుతూ మహిళలు పరుగులు తీస్తున్న దృశ్యాలు అడుగడుగునా కన్పిస్తున్నాయి. స్కూలు విద్యార్థులైతే సీఎం జగన్‌ను చూసేందుకు తల్లితండ్రులతోపాటు వస్తున్నారు. సీఎం జగన్‌ను చూడగానే ‘అదుగో జగన్‌ మామయ్య’ అంటూ చూపు­తున్నారు. ఆ పిల్లలను సీఎం జగన్‌ అక్కున చేర్చు­కుంటుండటంతో పిల్లలు ఆనందపరవశులవు­తు­న్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే సెల్ఫీ దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. యువత, మహిళలు, రైతులు, వృద్దులు ఇలా అన్ని వర్గాల వారి­తో సీఎం మేమకమవుతున్నారు.  బస్సు యాత్ర­లో భాగంగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగ­నూరు, మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేట, కావలి, కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి సూపర్‌ హిట్టయ్యాయి. ఏ సమయం అయినా సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించే రోడ్‌ షోల్లో అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. రాత్రి పొద్దుపోయినా దర్శి జన సంద్రాన్ని తలపించింది. 

ప్రజల్లో విశ్వసనీయతకు ప్రతీక 
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. గత 58 నెలల్లో అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.79 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం.

విద్య, వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ వరకు పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి ఆ వర్గాల సామాజిక సాధికారతకు బాటలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించి.. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో రోజు రోజుకు విశ్వసనీయత పెరుగుతోంది. ఇదే బస్సు యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టడానికి దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాబోయేది వైఎస్సార్‌సీపీ సునామీయే 

సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయ­లసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. ఇదే సమయంలో ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది.

ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. జనసేనతో జట్టుకట్టి తాడేపల్లిగూ­డెంలో ఉమ్మడిగా నిర్వహించిన సభ జనం లేక అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. దాంతో బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ–జనసేన.. సాక్షాత్తు ప్రధా­నిని రప్పించి చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమి­లో నైతిక స్థైర్యం దెబ్బతింది. పొత్తులో సీట్ల లెక్క తేలాక.. అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక, ఆపార్టీలో చెలరేగిన అసమ్మతి కూటమిని చావు దెబ్బతీసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వృద్ధులకు ఇంటి వద్ద పెన్షన్‌ అందించకుండా వలంటీర్లను చంద్రబాబు అడ్డుకోవడంతో కూటమిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఓ వైపు సీఎం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతుండటం.. మరో వైపు చంద్రబాబు ప్రజాగళం పేరుతో, పవన్‌ కళ్యాణ్‌ నిర్వ­హిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు మొహం చాటేస్తుండటంతో కూటమి అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌­సీపీ 21–22 లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకుని ఘన విజయం సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఈ దృష్ట్యా రాబోయేది వైఎస్సార్‌సీపీ సునా­మీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement