స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని టీడీపీ అనుకూల మీడియా కూడా అనుకోవడం లేదు. ఎల్లో మీడియా డిబేట్స్ లో ఆయా ఛానెళ్ల ప్రెజంటర్లు సైతం చంద్రబాబు లూటీని ఆమోదిస్తున్నారు. కాకపోతే అదేమన్నా పెద్ద కుంభకోణమా ? అని చాలా కోప్పడిపోయారు వారు. అంతే కాదు ఏదో ఒక రోజు తన పాపం పండి తన బాగోతం బట్టబయలై తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసని.. అందుకే ఆయన చాలా తెలివిగా 17-ఏ సెక్షన్‌ను తీసుకు వచ్చారని ఏ మాత్రం సిగ్గులేకుండా భయం లేకుండా నామోషీ పడకుండా చెప్పుకుంటున్నారు. అదో పెద్ద ఘనతగా కూడా భావిస్తున్నారు.
✍️371 కోట్ల రూపాయల దోపిడీ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థల చలవతో చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టినపుడు కూడా చంద్రబాబు నాయుడు తాను అవినీతికి పాల్పడలేదని అనలేదు. తనను అరెస్ట్ చేసిన 24 గంటలలోపు కోర్టుముందు హాజరు పర్చలేదని మాత్రమే అన్నారు. చంద్రబాబు పై సీఐడీ చూపించిన ఆధారాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారు. అసలు జైలుకు వెళ్లకుండానే చంద్రబాబు ఇంటికి వచ్చేస్తారని తమ డిబేట్లలో చెప్పుకున్న ఎల్లో మీడియా ఛానెళ్లు బాబును జైలుకు పంపిన వెంటనే షాక్ తిన్నాయి. ఓ చానెల్ ప్రెజంటర్ అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యానికే బ్లాక్ డే అనేశారు.చంద్రబాబును జైలుకు పంపే వరకు అసలు కుంభకోణమే జరగలేదన్నారు అనుకూల మీడియా పెద్దలు. లక్షల మందికి స్కిల్ ట్రెయినింగ్ ఇచ్చారు కదా అని వాదించారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు.
✍️వారి అంచనాలు తల్లకిందులు చేస్తే బాబును జైలుకు పంపడంతో కొత్త రాగం అందుకున్నారు ఎల్లో బ్యాచ్. అసలు స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంతో చంద్రబాబు నాయుడికేం సంబంధం? ఆయన కింద పనిచేసే అధికారులను అరెస్ట్ చేయకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం ఏంటి? అని చంద్రబాబు నాయుడి రాజ గురువు రామోజీ పత్రికలోనూ.. బాబు జేబు మీడియా అయిన ఏబీఎన్ మీడియాలోనూ పుంఖాను పుంఖాలుగా కథలు వార్చి వండారు. బాబు జైల్లో ఉండగా ఈ కుంభకోణంలో మరో నిందితుడు అయిన సుమన్ బోస్‌ను తెరపైకి తెచ్చి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. కాకపోతే సుమన్ బోస్ ను గతంలోనే ఈడీ అరెస్ట్ చేసి అతని వాంగ్మూలాన్ని రికార్డు చేసింది కూడా. అంటే ఓ దొంగ చేత ఇంకో దొంగకి క్లీన్ చిట్ ఇప్పించే ప్రయత్నం చేశారు టీడీపీ అండ్ ఎల్లో మీడియా. అయితే అది వర్కవుట్ కాలేదు.
✍️ఆ తర్వాత మరింత బరితెగించిన ఎల్లో మీడియా తన డిబేట్‌లో యాంకర్ మాట్లాడుతూ అయినా 371 కోట్ల రూపాయల కుంభకోణం కూడా ఓ కుంభకోణమేనా? దాని గురించి ఇంత గగ్గోలు అవసరమా? అని ప్రశ్నించారు. అది చూసిన విశ్లేషకులకు గుండె ఆగినంత పని అయ్యింది. ఆ చానెల్ యాంకర్ మాటలను పరిశీలిస్తే చంద్రబాబు స్థాయికి కనీసం కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉండాలి కానీ మరీ ఇంత చిన్న కుంభకోణం గురించి సీఐడీ పోలీసులు యాగీ చేయాల్సిన అవసరం లేదన్నట్లు వారి వాదన ఉంది.
✍️17-ఏ సెక్షన్ ప్రకారం అసలు చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వీల్లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. రెండు వాదనలూ విన్న న్యాయమూర్తి సీఐడీ అభిప్రాయంతో ఏకీభవించి..చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
✍️హైకోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించడానికి ముందు ఎల్లో మీడియాలో అసలు 17- ఏ సెక్షన్ తీసుకు వచ్చిందే చంద్రబాబు నాయుడు అని కీర్తించారు. ఏదో ఒక రోజున తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని.. తనను జైలుకు పంపినా పంపుతారని ఆయన ముందుగానే ఊహించిన విజనరీ అని కూడా పొగిడాయి. అందుకే తనని తాను కాపాడుకోడానికి చంద్రబాబే ఈ సెక్షన్ ను తీసుకు వచ్చేలా తనకున్న పలుకుబడిని ఉపయోగించారని వారు చాలా గొప్పగా చెప్పుకుని భజన చేసి మురిసిపోయారు.
✍️అయితే న్యాయస్థానంలో మాత్రం ఇది వర్కవుట్ కాలేదు. ఎల్లో మీడియా ఓవరాక్షన్ చూస్తోన్న టీడీపీ పాత తరం నాయకులు, టీడీపీ పట్ల ఎంతో కొంత సానుభూతి ఉన్న వారు కూడా చంద్రబాబును నిండా ముంచుతున్నది ఆయనది అనుకున్న ఎల్లో మీడియానే అని మండి పడుతున్నారు.
-సీఎన్‌ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment