సాక్షి, న్యూఢిల్లీ: సీఎం పదవిని కాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్‌ను గవర్నర్ తక్షణం పదవి నుండి తొలగించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసైకు ఆయన సోమవారం లేఖ రాశారు. టీఆర్‌ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్‌పై విశ్వాసం సన్నగిల్లిందని, కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యేల్లో నమ్మకం పోయిన కారణంగానే ముఖ్యమంత్రి మార్పుపై చర్చ జరుగుతోందని అరవింద్ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీ విజయ్‌చౌక్‌లో అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ సమావేశం గులాబీ డ్రామాలకు తెరదించిందని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎదురవుతున్న అపజయాలతో పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో, ముఖ్యమంత్రి అభద్రతాభావంతో ఉన్నారని అందుకే ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏ హక్కుతో శాసనసభ్యులను బెదిరిస్తున్నారని అరవింద్ ప్రశ్నించారు.
కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలి
గవర్నర్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు పత్రికల్లో వచ్చిందని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అటు రాజ్యాంగాన్ని, ఇటు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనన్నారు. ఈ లేఖ ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కూడా పంపినట్టు సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment