న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. ఆ పార్టీ లూటీకి మాత్రమే గ్యారెంటీ ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన డబ్బు వసూళ్ల కోసం కర్ణాటకను ఆ పార్టీ ఏటీఎంలా మార్చేయడం సిగ్గు చేటన్నారు. కర్ణాటకలోని కొందరు కాంట్రాక్టర్ల నివాసాలపై దర్యాప్తు సంస్థల్లో సుమారు రూ.100 కోట్ల అక్రమసొత్తును బయటపడినట్లుగా వచ్చిన వార్తలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అవినీతి డీఎన్‌ఏకి ఇది ఒక చిన్న మచ్చుతునక మాత్రమేనని ఆయన సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులైన ఈ కాంట్రాక్టర్లే గత బీజేపీ ప్రభుత్వం కమీషన్లు వసూలు చేస్తోందంటూ ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి పెచ్చుమీరిందని ఆరోపించారు.‘కాంగ్రెస్, అవినీతి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను కూడా కాంగ్రెస్ అవినీతికి ఏటీఎంలుగా మార్చుకుంది. ఇప్పుడు తెలంగాణ, మధ్యప్రదేశ్‌లను కూడా ఏటీఎంలుగా మార్చి ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఉద్దేశించిన ధనాన్ని దోచుకోవాలని కలలుగంటోంది. కాంగ్రెస్ లూటీకి మాత్రమే గ్యారెంటీ ఇవ్వగలదు’అని నడ్డా ఆరోపించారు. హామీలు ఇవ్వడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి హామీలకు బదులు గ్యారెంటీలిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment