
సాక్షి, ఖమ్మం: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. రైతులు, మహిళలు, యువత కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. తెలంగాణలో గతేడాది అక్టోబర్‌లో రాహుల్ జోడోయాత్ర చేశారని, 12 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించారని చెప్పారు. తెలంగాణలో సుమారు 405 కిలోమీటర్ల జోడోయాత్ర ద్వారా కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు.
ఈ మేరకు ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్‌లో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావుతో కలిసి జైరాం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సామాజిక న్యాయం అమలు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే సోనియా తెలంగాణను ఇచ్చారన్నారు. బ్రాండ్ హైదరాబాద్ ఒక్కటే కాదు.. బ్రాండ్ తెలంగాణ సృష్టించడమే సోనియా లక్ష్యమని తెలిపారు. కానీ తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడ కనిపించట్లేదని దుయ్యబట్టారు.
అయితే పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని విమర్శించారు. అప్పుడు హైదరాబాద్‌కే పెట్టుబడులు వచ్చేవని ఇప్పుడు కూడా అక్కడికే వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించలేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర అయ్యాక తెలంగాణ ప్రజలు మేలు జరిగిందా అని ప్రశ్నించారు. ఎందుకు తెలంగాణ ఏర్పాటు చేశామో పదేళ్ల తర్వాత కూడా ఆ లక్ష్యాలు సాధించలేదని మండిపడ్డారు.
చదవండి: హైదరాబాద్‌లో ఒలింపిక్ జరిగేలా ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్
‘నిరుద్యోగుల శాతం అధికంగా ఉంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అవతున్నాయి. ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉన్నత పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే వెళ్లాయి. బీసీ, మైనార్టీ, దళితులకు ఎన్ని పదవులు వచ్చాయి?. తండ్రి, కోడుకు, కూతురు, అల్లుడు పాలన తెలంగాణలో నడుస్తుంది. ఈ నలుగురికే అవకాశాలు వచ్చాయి.
సబ్బండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు, బీ టీమ్ బీజేపీ, సీ టీమ్ ఎంఐటెం. కాంగ్రెస్‌కు సీపీఐ, టీజేఎస్ వెంట ఉన్నాయి. గ్యారంటీలే కాంగ్రెస్‌కు అధికారం తెచ్చిపెడుతాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ళ లో యువతకు ఏం లాభం జరగలేదు. తొమ్మిది ఏళ్లలో కేసీఆర్ ఒకసారి కూడా సచివాలయానికి రాలేదు. బీఆర్‌ఎస్‌కు బైబై చెప్పే రోజు వచ్చింది. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment