ఆయన తెలంగాణ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. వచ్చే ఎన్నికల్లో తన ఇద్దరు కొడుకులను ఎన్నికల్లో దించాలని చాలాకాలంగా ఆలోచిస్తున్నారు. ఆయన కుమారులు కూడా తండ్రికి జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాని ఆ సీనియర్ నేత తాను కూడా బరిలోకి దిగాలానుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మొన్నటివరకు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్న ఆ సీనియర్ మళ్ళీ బరిలోకి దిగాలని ఎందుకు అనుకుంటున్నారు?
కుందూరు జానారెడ్డి గురించి తెలంగాణ రాజకీయాలు తెలిసినవారికి పరిచయం చేయనక్కర్లేని పేరు. ఈయన ఇద్దరు కుమారులు ఇప్పటివరకు తెరముందుకు రాకపోయినప్పటికీ చాలాకాలం నుంచి రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఎప్పటి నుంచో తన కుమారుల్ని ఎన్నికల రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కంటున్న జానారెడ్డి ఇదే సరైన సమయం అనుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నా కూడా జానారెడ్డి మాటను కాదనగల పరిస్థితి ఎవరికీ ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలా అయినా ఇద్దరిలో ఒకరిని.. కుదిరితే ఇద్దరినీ బరిలో దించేందుకు జానారెడ్డి పావులు కదుపుతున్నారట.
వ్యూహంలో భాగంగానే..
జానారెడ్డి వ్యూహంలో భాగంగానే చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళుతున్నారు. నియోజకవర్గంలోని 90 తండాలను దాదాపు రెండు వారాల పాటు చుట్టి వచ్చేలా ప్రణాళికను వేసుకున్నారట. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్రెడ్డి.. తన యాత్రలో ఎక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు మోసం చేస్తోందన్న విషయాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకుపోతున్నారట.
గిరిజనుల నుంచి పాదయాత్రకు మంచి మద్దతే లభిస్తోందని కాంగ్రెస్ నేతలు ఖుషీ అవుతున్నారని టాక్. ఉన్నట్లుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారట జైవీర్ రెడ్డి.
సీఎం కుర్చి కోసం..
ఈ పాదయాత్ర ద్వారా వచ్చే ఎన్నికల్లో సాగర్ నుంచి తానే పోటీ చేస్తానని పార్టీ నేతలకు స్పష్టత ఇస్తున్నారట జైవీర్. అయితే కొందరు అనుచురులు మాత్రం చివరి నిమిషంలో జానారెడ్డి బరిలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తుందని భావిస్తున్న జానారెడ్డి ఈసారికి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే వాదన ఉంది.
అయితే ఈ విషయంలో జానారెడ్డి ఇంత వరకు నోరు మెదపనప్పటికీ.. ఒకవేళ తండ్రి పోటీ చేస్తానంటే మాత్రం జైవీర్ తర్వాతి ఎన్నికల వరకు ఆగుతారని అంటున్నారు. ఇదే సమయంలో జానారెడ్డిని అసెంబ్లీకీ కాకుండా నల్లగొండ లోక్‌సభ నుంచి బరిలో నిలిపేతే ఎలా ఉంటుందా అని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోందట. ఎలాగూ ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో లోక్‌సభకు జానారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమని కాంగ్రెస్ భావిస్తోందట.
మొత్తంగా జైవీర్ పాదయాత్రతో సాగర్ కాంగ్రెస్‌లో ఓ కొత్త ఊపు వచ్చిందని చెబుతున్నారు. నిరంతర ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి ఎలా అయినా గెలవాలన్న కసితో ఉన్నా.. ఇన్నాళ్లు నాయకత్వం స్తబ్ధుగా ఉండటంతో నిరాశలో ఉండిపోయారు. తాజాగా పాదయాత్ర పేరుతో జైవీర్ లైన్లోకి రావడంతో శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయట.
ఇదీ చదవండి: JP Nadda Tour: జేపీ నడ్డా తెలంగాణ పర్యటన లైవ్ అప్‌డేట్స్..
Comments
Please login to add a commentAdd a comment