సాక్షి, నల్లగొండ: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సోమవారం గుర్రంపోడులో ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలే క్షమాపణలు చెప్పాలన్న మంత్రి జగదీశ్ కామెంట్లపై భట్టి స్పందించారు.
తెలంగాణ కోసం పోరాడిందే.. జలాల కోసం. అలాంటిది అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు కావస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి. నేను ప్రశ్నిస్తే ముక్కు నేలకు రాయాలంటూ విమర్శలు చేసిన మీరు నీళ్లు ఇవ్వకుండా గాడిదలు కాస్తున్నారా?. ఎస్ఎల్బీసీ పూర్తి కాకుండా అడ్డుకున్నది ఎవరు?. నల్లగొండ జిల్లా ప్రజలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి. దీనిపై చర్చించేందుకు నేను సిద్ధం. పది సంవత్సరాలుగా డిండి, ఎస్ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తి చేయనందుకు చిత్తశుద్ధి ఉంటే సుఖేందర్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయాలని భట్టి అన్నారు.
జిల్లాలో ఏ చిన్న పిల్లాడిని అడిగిన నాగార్జునసాగర్ కట్టింది, కాలువలు తవ్వింది కాంగ్రెస్ అని చెప్తారు. నాగార్జునసాగర్ కూడా కేసీఆర్ కట్టాడన్న భ్రమలో జిల్లా మంత్రి(జగదీష్ రెడ్డిని ఉద్దేశించి..) ఉన్నాడు. ఎందరో మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ జిల్లాలో మంత్రిగా జగదీష్ రెడ్డి ఉండడం దురదృష్టకరం. నాగార్జునసాగర్ నిర్మాణం చేసినందుకా? పార్లమెంట్లో మెజార్టీ లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకా? ఢిల్లీ వరకు ముక్కు రాయాలి?. భూస్వామ్య గడీల మనస్తత్వం ఉన్నవారే ముక్కు నేలకు రాయమంటారు. జగదీష్ రెడ్డి మీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారా? కేసీఆర్ కు భజన చేస్తూ భూస్వామ్య, ఫ్యూడలిజం సమాజంలో ఉన్నారా?. కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీష్ రెడ్డిలా ఇసుక దందా, భూదందా చేయలేదు.
పొద్దు తిరుగుడు పువ్వులా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరే సుఖేందర్ రెడ్డి గారు మీ గత ఆస్తులకు ఇప్పుడు పొంతన ఉందా?. ఏ మాన్యువల్ లేని విధంగా ఎమ్మెల్యేలకు కూడా పైలట్ వాహనాలు ఇచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు కేసీఆర్ ని నిధులు ధైర్యం గుత్తా, జగదీష్ రెడ్డిలకులేదు. వారే రెండు చేతులు జోడించి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తే అర్హత జిల్లా మంత్రికి లేదు. యాదాద్రి పవర్ ప్లాంటు త్వరితగరితన పూర్తి చేయకుండా జిల్లా మంత్రి గాడిదలు కాస్తుండా?. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని పవర్ ప్రాజెక్టులు కట్టింది?. ఏ పవర్ ప్రాజెక్టుల నుంచి కరెంటు ఇస్తున్నారు?. ఏ పవర్ ప్రాజెక్టు కట్టి విద్యుత్ ఇస్తున్నారో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పాలి అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
ఇదీ చదవండి: గవర్నర్-కేసీఆర్.. ఓ ఇంట్రెస్టింగ్ పరిణామం
Comments
Please login to add a commentAdd a comment