
సాక్షి, హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరంటున్నారని, వారి వద్ద ఉన్న వాళ్లందరూ తమ వాళ్లేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి తమ దుకాణం ఖాళీ చేసి, వాళ్లది నింపుకున్నారని, తమ గవర్నమెంట్ వస్తే.. టీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని చెప్పారు. మంత్రి తలసాని వ్యాఖ్యలతో ప్రభుత్వం అభాసుపాలవుతోందని, లక్ష ఇళ్లని చెప్పి.. ఆఖరుకు 20 వేలకు మించి చూపలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ వేదికగా ఎల్ఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ముందు పెట్టాం. 131 జీవోను రద్దు చేసి, ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని కోరాం.
రెగ్యులరైజ్‌కు సమయం రెండు నెలలు కాకుండా.. ఏడాది కాలం ఇవ్వాలని కోరాం. డబ్బులు 50 శాతం తగ్గించాలని కోరినప్పుడు కేటీఆర్ వెంటనే స్పందించారు. మంత్రి కేటీఆర్‌కు మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెబుతున్నా. డబ్బులు తగ్గించడంతో పాటు 6 నెలల సమయం ఉంటుందన్నారు. లక్ష రూపాయలు కట్టే ప్లాట్‌పై 40 వేల రూపాయలకు కుదిస్తే.. సంతోషంగా చెల్లిస్తారు. రెవెన్యూ చట్టంలో మార్పులు చేర్పులకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయాయి. తక్షణమే రిజిస్ట్రేషన్‌లు జరిగేలా జీవో ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌లు ఆగిపోవడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టమే’’అని అన్నారు.