సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే ప్రధాని నరేంద్ర మోదీని కలిశానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రధానితో జరిగిన భేటీలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను మా త్రమే మాట్లాడానని, మా మధ్య ఎలాంటి రాజకీ యపర అంశాలపై చర్చ జరగలేదని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
గురువారం ఢిల్లీలో పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో సుమారు 20 నిమిషాల పాటు నరేంద్ర మోదీతో భేటీ అయిన కోమటి రెడ్డి ఏడు అంశాలకు సంబంధించిన విజ్ఞాపనలను ప్రధానికి అందించారు. అనంతరం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్ల రహదారిగా విస్తరించే చర్యలను వెంటనే తీసుకోవాలని ప్రధాని మోదీని కోరానని తెలిపారు.
నిత్యం రోడ్డు ప్రమా దాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న ఈ రహదారి విస్తరణపై దృష్టి సారించాలన్నారు. కాగా తన వినతిపై స్పందించిన ప్రధాని, అధికారులతో సమీక్ష జరిపి త్వరలో ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.
నేను అడిగినవి ఇవే...
’’భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకొనేందుకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని కోరాను ’చేనేత కార్మికులకు ఉపయోగపడే ఆసు యంత్రాలను రెండు విడతల్లో కనీసం 1000 మంజూరు చేయాలి.
18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న చేనేత కార్మిక కుటుంబాలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశాను. ముఖ్యంగా ఎంఎంటీఎస్–2లో భాగంగా ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర వాటాగా రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేని విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను.
రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా ఇచ్చినా, ఇవ్వకున్నా మొత్తం కేంద్రం భరించి ప్రాజెక్టును అమలు చేయాలని... ఈ ప్రాజెక్టును ఆలేరు, జనగాం వరకు పొడగించాలని కోరా ను మరోవైపు హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విస్తరించాలని ప్రధానిని కోరాను’’అని వెంకటరెడ్డి వివరించారు.
అలాగైతే నడ్డాను కలుస్తాను గానీ...
రాజకీయ అంశాలపై అయితే పార్టీ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తాను కానీ..పార్లమెంటులో ప్రధాని మోదీని ఎందుకు కలుస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక పార్లమెంటు సభ్యునిగా ప్రధానిని అభివృద్ధి పనులపై కలిశానే తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు.
వడగండ్ల వాన పడి రైతులు నష్టపోయిన ఆరురోజుల తర్వాత పర్యటించేందుకు సీఎంకు తీరిక కుదిరిందా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. వడగండ్లకు సంబంధించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రం తరపున తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment