ప్రధాని మోదీపై మంత్రి కోమటిరెడ్డి ధ్వజం
ఏపీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాదు
మరో 20 ఏళ్ల వరకు అక్కడ కాంగ్రెస్ గెలవదు
సీఎంగా పదేళ్లు రేవంత్‌రెడ్డినే ఉంటాడు
జూన్ 5న 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి
మీట్ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఈసారి ఎన్నికల్లో చెప్పుకునేందుకు ఏమీ లేక రాముడే దిక్కయ్యాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఈసారి మోదీ గెలిస్తే దేశంలో ఇకఎన్నికలు ఉండవని, చైనా, రష్యా తరహాలో నియంతృత్వ రాజరిక పాలన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏపీలో ఒక్కసీటు కూడా రాదన్నారు. అందరి ఆమోదంతోనే సీఎంగా రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారని, ఈ ఐదేళ్లే గాక మరో ఐదేళ్లు కూడా రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే...
ప్రధానిగా ఉండి ఒక మతాన్ని టార్గెట్ చేస్తారా?
దేశ జనాభాలో 25 కోట్ల మంది ఉన్న ముస్లిం జనాభాను ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో మోదీకి చెప్పుకునేందుకు ఏమీలేదు. అందుకే మతాన్ని, రామున్ని ముందుకు తెచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని భయపెడుతున్నారు. బీజేపీ ఓట్ల కోసం మతాల వారీగా జనాభాను విభజించి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది.
అక్కడ కాంగ్రెస్ నాశమవుతుందని తెలిసినా
తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నాశనమ వుతుందని తెలిసి కూడా ప్రజలకిచ్చిన మాట ప్రకా రం సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. అను కున్నట్టే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. 20 ఏళ్ల వరకు అక్కడ కాంగ్రెస్ కోలుకోదు. 2014, 2019లో ఒక్కసీటు రాలేదు. ఈ సారి కూడా ఒక్కసీటూ అక్కడ కాంగ్రెస్ గెలవదు.
నేను సీఎం పదవి అడగలేదు
నేను సీఎం పదవి అడగలేదు. నన్ను ఎమ్మెల్యేల క్యాంపులో ఉండమంటే మూడు రోజులు రూం నుంచి కూడా బయటకు రాలేదు. సీఎం రేవంత్.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వంటి సీనియర్లతో పాటు అందరి అభిప్రాయాలను గౌరవిస్తున్నారు. అందరం కలిసి అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని బాగు చేసే పనిలో ఉన్నాం. ఈ ఎన్నికల్లో 15 సీట్లు మా టార్గెట్. 14 సీట్లు అయినా గెలుచుకుంటాం.
జూన్ 4 తర్వాత బీఆర్‌ఎస్ ఉండదు
జూన్ 4 తరువాత తెలంగాణ భవన్ మూతపడు తుంది. జూన్ 5న 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజ కవర్గ పునర్విభజనలో రాష్ట్రంలో 154 సీట్లు ఉండబోతున్నాయి. అందులో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment