సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తూనే అభ్యర్థి ఎంపిక విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బరిలో నిలవనుండటం, కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఒకరిద్దరు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన పరిస్థితులను బేరీజు వేస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే హుజూరాబాద్ బరిలో బడా నేతను దింపాలని, అభ్యర్థి ప్రకటనతోనే తాము ప్రధాన పోటీలోకి వచ్చేలా ఈ ఎంపిక జరపాలని యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ముగ్గురు, నలుగురు నేతలతో పాటు స్థానికంగా కేడర్‌కు అందుబాటులో ఉన్న ముఖ్య నేతల పేర్లను కూడా పరిశీలిస్తోంది.
త్రిముఖ పోటీతో ఉపశమనమే..
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 61 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి కంటే దాదాపు 40 వేల ఓట్లు తక్కువ వచ్చినా గతంలో ఎన్నడూలేని విధంగా పెద్ద సంఖ్యలో ఓట్లు కాంగ్రెస్ బాక్సుల్లో పడ్డాయి. 2018లో ద్విముఖ పోటీ జరగ్గా, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో త్రిముఖ జరుగుతుందని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. ఈటల వ్యక్తిగత ఓట్లు, బీజేపీ ఓట్లు ఒకవైపు, అధికార పక్షం ఓట్లు మరోవైపు నిలబడితే గత ఎన్నికల్లో తమకు లభించిన ఓట్లు తెచ్చుకున్నా సరిపోతుందని, అయితే ఆ ఓట్లను తమవైపు మరల్చగలిగే అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న ఈటలను, తెలంగాణను తామే తెచ్చామని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే అదే స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల గురించి ఆరా తీస్తోంది. ఇందులోనూ సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఆ నియోజకవర్గంలో బీసీల ఓట్లు లక్షకు పైగా ఉండటం, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు ఉండటంతో మాదిగ సామాజిక వర్గంతో పాటు బీసీ నేతల పేర్లను పరిశీలిస్తోంది.
అందులోభాగంగా రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ హైకమాండ్‌తో కీలకంగా వ్యవహరించడంతో పాటు రాష్ట్రంలోని దళితులకు సబ్‌ప్లాన్ ఏర్పాటు కోసం సారథ్యం వహించిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ ముఖ్య నాయకుడి పేరును ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటోంది. ఆయనతో పాటు తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడిన నాయకుడిగా గుర్తింపు ఉన్న ఓ బీసీ నేత, మాదిగ సామాజిక వర్గానికే చెందిన మరో రాష్ట్ర కాంగ్రెస్ యువనేతను బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపైనా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా హుజూరాబాద్ అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పబోమని, అభ్యర్థి ఎంపిక అనూహ్యంగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో పాటు పలువురు రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఇలా చెప్పడం వ్యూహంలో భాగమేనని, తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు వీలుగానే అభ్యర్థి ఎంపిక ఉంటుందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పోటీలోకి వెళ్తామని, రేసులో ఎక్కడా వెనుకబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీపీసీసీకి చెందిన ఒక ముఖ్య నేత వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment