ఇల్లందకుంట హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో శనివారం రాత్రి 7:30 గంటలకు క్యూలో వేచి ఉన్న ఓటర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన హుజూరాబాద్ ఉపఎన్నిక అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తడంతో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 82.19% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అధికార టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈటల రాజేందర్ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టీఆర్‌ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్)లు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఈటల, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత చేకూరింది. 12 గంటల పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మధ్యాహ్నానికే 45% దాటిన పోలింగ్
నియోజకవర్గంలోని ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్, కమలాపూర్‌లలో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం ప్రారంభమైంది. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఉదయం 9 తరువాత పోలింగ్ ఊపందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో 10.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పూట వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా ఓట్లు వేసేందుకు వచ్చారు.
పోలింగ్ సమయం రాత్రి 7 గంటల వరకు ఉన్నా.. మధ్యాహ్నం లోగానే ఓటు వేసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. మధ్యాహ్నం ఒంటిగంటకే పోలింగ్ 45 శాతం దాటడం అధికారులను ఆశ్చర్యపరిచింది. రైతులు, ఇతర వ్యవసాయ పనులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు, ఇతర ప్రాంతాల్లో సెటిలైనవారు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాయంత్రం 6 గంటలకే చీకటి పడినా.. అధికారులు ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా అంతా ఇబ్బందుల్లేకుండా ఓట్లేశారు. చివరి గంటలో కరోనా పాజిటివ్ రోగులు ఓటేసేందుకు అనుమతించారు. సాయంత్రానికి 76.26 శాతానికి చేరుకున్న పోలింగ్ పర్సంటేజీ, చివరగా పోలింగ్ ముగిసేసరికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 86.33 శాతానికి చేరింది.
మూడంచెల భద్రతలో ఈవీఎంలు
గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసేది. కానీ కరోనా నిబంధనలతో రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. అయినా మండలాల్లోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాంటి కేంద్రాల్లో 7 గంటల తరువాత ఈవీఎంలను సీజ్ చేసి కరీంనగర్‌కు తరలించారు. ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక వంటి కొన్ని పోలింగ్‌స్టేషన్లలో ఓటర్లు సాయంత్రం కూడా బారులు తీరారు. రాత్రి ఏడు గంటల లోపు క్యూలో ఉన్నవారిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. ఈవీఎంలన్నీ కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు తరలించి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదేరోజు అభ్యర్థుల భవితవ్యంపై ప్రజా తీర్పు వెలువడనుంది.
భారీ బందోబస్తు
నియోజకవర్గంలో మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 172 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 73 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 1,800 మంది (90 కంపెనీలు) కేంద్ర బలగాలు, 2,000 మందికి పైగా స్థానిక పోలీసులు కలిపి మొత్తం సుమారు 4,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అక్కడక్కడా చిన్నచిన్న గొడవలు
నియోజకవర్గంలో పలుచోట్ల చిన్నచిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి వీణవంక పోలింగ్ కేంద్రంలో పర్యటించిన సమయంలో బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. మరోవైపు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీపై బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగారు. మరికొన్ని చోట్ల రెండుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు.
► జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో అధికార పార్టీ వారు డబ్బులు పంచుతున్నారని బీజెపీ నేతలు ధర్నాకు దిగారు.
► జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో అధికార పార్టీ తరఫున ఓ మీడియా ప్రతినిధి డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు.
► హుజూరాబాద్‌లోని రెండు వార్డుల్లో డబ్బులు పంపిణీ చేసిన ఓ పార్టీకి చెందిన స్థానికేతర నేతలను స్థానికులు అడ్డుకోవడం గొడవకు దారితీసింది.
► ఇల్లందకుంట మండలం సిరిసేడు, శ్రీరాములుపల్లిలో డబ్బులు పంచుతున్నారంటూ గొడవలు జరిగాయి.
► తమ డబ్బులు ఇవ్వలేదంటూ వీణవంక మండలం గంగారం, ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామాల్లో ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు.
► మధ్యాహ్నం వరకు స్థానికులు, ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో నివసించేవారు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇదే సమయంలో తమకు అనుకూలంగా ఉండే వర్గాలన్నీ అకస్మాత్తుగా మరో పార్టీకి ఓటేశాయనే ప్రచారం ప్రధాన పార్టీల్లో జరిగింది. దీంతో ఎవరి ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో తెలియని అయోమయం నెలకొంది.
ఎగ్జిట్ పోల్ సర్వేలు
దాదాపు ప్రతి పోలింగ్‌స్టేషన్ వద్ద పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. కానీ చాలామంది తీర్పును వెల్లడించేందుకు నిరాకరించారు. దీంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారు అన్న విషయంలో అన్ని పార్లీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment