సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఆయన శుక్రవారమే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు కట్టుబడి ఒక్కరికి ఒకే పదవి అనే నిబంధనను పాటిస్తూ ఆయన శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్లు సమాచారం.
ఖర్గే రాజీనామాతో రాజ్యసభ ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్‌లలో ఒకరు ఎంపికయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ శుక్రవారంతో(సెప్టెంబర్ 30) ముగిసింది. ఖర్గేతో పాటు శశిథరూర్, ఆర్‌ఎన్ త్రిపాఠి పోటీలో ఉన్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. థరూర్, ఖర్గేలో ఎవరు గెలిచినా 25ఏళ్ల తర్వాత కాంగ్రెస్ చీఫ్‌గా ఓ దక్షిణాది నాయకుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడి నుంచి చివరిసారి 1994లో పీవీ నరసింహారావు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు.
అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. గాంధీ కుటుంబం విధేయుడు కావడం, సుదీర్ఘ అనుభవం, దళిత నేత వంటి కారణాలు ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్ సహా కాంగ్రెస్ జీ-23నేతలు కూడా ఖర్గేకే మద్దతు తెలిపారు. దీంతో ఆయన విజయం నల్లేరుపై నడకే అని పార్టీ వర్గాలు అంటున్నాయి.
చదవండి: చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన మోదీ
Comments
Please login to add a commentAdd a comment