దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే చవిచూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నోట పదేపదే విన్పించే ‘కాంగ్రెస్ ముక్త భారత్’నినాదం త్వరలో నిజమయ్యే పరిస్థితి కన్పిస్తోంది...
2004 నుంచి యూపీఏ కూటమి సారథిగా పదేళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చలాయించింది. నిజానికి 1999 నుంచి 2004 దాకా అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వాజ్‌పేయి నాయకత్వంలో మంచి పనితీరే కనబరిచినా గుజరాత్ మత ఘర్షణలు పెద్ద మైనస్‌గా మారాయి. 2004 ఎన్నికల సమయంలో ఓవైపు నిరుద్యోగ సమస్య వేధిస్తుంటే ఇండియా షైనింగ్ అంటూ ఊదరగొట్టడం జనానికి నచ్చలేదు.
దాంతో ఎన్డీఏను తిరస్కరించారు. సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 145 సీట్లు నెగ్గగలిగింది. యూపీఏ1 పాలన ఫర్వాలేదనిపించినా యూపీఏ2 హయాంలో వెలుగు చూసిన లెక్కకు మించిన కుంభకోణాలు కాంగ్రెస్‌ను కుదిపేశాయి. దీనికి తోడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై సోనియా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ కర్ర పెత్తనం కాంగ్రెస్ ప్రతిష్టను బాగా మసకబార్చాయి.
ఈ పరిస్థితిని నరేంద్ర మోదీ రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని సుడిగాలిలా దేశమంతటినీ చుట్టేశారు. అమిత్ షాతో కలిసి అద్భుతమే చేసి చూపించారు. కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తూ సొంతంగానే 282 సీట్లతో అఖండ విజయం అందుకున్నారు. మిత్రపక్షాలతో కలిపి ఏకంగా 336 స్థానాలు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా 44 స్థానాలకు పడిపోయి కుదేలైంది. పార్టీ ఓటు షేరు కూడా ఎన్నడూ లేనంతగా 19 శాతానికి పడిపోయింది. అప్పటినుంచి ఇక పార్టీ కోలుకోనే లేదు.
పైగా నానాటికీ దిగజారుతూనే వస్తోంది. వరుస ఎన్నికల్లో పరాజయాల పరంపర కొనసాగుతూనే వస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే మూటగట్టుకుంది. 2017లో మణిపూర్, గోవాల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచినా చిన్నాచితకా పార్టీలతో సరైన సంప్రదింపులు చేయలేక రెండుచోట్లా అధికారానికి దూరమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 52 సీట్లకు పరిమితమై మరోసారి చతికిలపడింది.
ఓటు షేరు కూడా 19 శాతానికే పరిమితమైంది. రాష్ట్రాలవారీగా చూసినా రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ మాత్రమే కాంగ్రెస్ చేతిలో మిగిలాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోనూ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ ఒకట్రెండు స్థానాలకు పరిమితమై మరోసారి దారుణ పరాభవాన్నే చవిచూసింది. ఆ రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితే కన్పించడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో మాత్రమే! జార్ఖండ్, మహారాష్ట్రల్లో పాలక సంకీర్ణంలో భాగస్వామిగా కొనసాగుతోంది. దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్‌కు ఇంతటి హీన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు.
స్వయంకృతమే...
కాంగ్రెస్ ప్రస్తుత దుర్దశ చాలావరకు స్వయంకృతమనే చెప్పాలి. యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్‌ను నామమాత్రం చేసి అసలు అధికారమంతా సోనియా, రాహుల్ చలాయించిన తీరుతోనే దిగజారుడు మొదలైంది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌గాంధీ అయిష్టత పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆయన నాన్చుడు ధోరణి, స్పష్టత లేని వ్యవహారశైలి కూడా కాంగ్రెస్‌కు మైనస్‌గానే మారుతూ వచ్చాయి.
వీటికి తోడు సీనియర్లు, జూనియర్ల అంతర్గత కలహాలు రచ్చకెక్కి పార్టీని మరింత భ్రష్టుపట్టించాయి. జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నాయకుల నిష్క్రమణతో కాంగ్రెస్ మరింత డీలాపడింది. 20 మందికి పైగా సీనియర్ లీడర్లు పార్టీ నాయకత్వం తీరును తప్పుబడుతూ లేఖలు రాయడం వంటివి ఇంకింత అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. నాయకత్వ లేమికి ఇవన్నీ తోడై కాలూ చేయీ కూడదీసుకోలేక అసలే కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రోకటిపోటుగా పరిణమించాయి.
Comments
Please login to add a commentAdd a comment