Delhi Services Bill Passed In Lok Sabha, Opposition Walks Out - Sakshi
Sakshi News home page

ఆందోళన నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. విపక్షాల వాకౌట్‌

Published Thu, Aug 3 2023 7:38 PM | Last Updated on Thu, Aug 3 2023 7:47 PM

Delhi Services Bill Passed In Lok Sabha Opposition Walks Out - Sakshi

సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఆందోళనల నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్‌(సవరణ) బిల్లు 2023కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం మూజువాణి(వాయిస్‌) ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశాయి.  

అంతకు ముందు విపక్షాలు సైతం బిల్లుపై చర్చల్లో పాల్గొన్నాయి. తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. బిల్లుపై అభ్యంతరాలకు సమాధానం ఇచ్చారు. ఈ తరుణంలో వాయిస్‌ ఓటు జరగ్గా.. విపక్షాల ఆందోళన నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. ఆప్‌ ఎంపీ సుశీల్‌కుమార్‌ రింక్‌ బిల్‌ పేపర్లు చింపి వెల్‌లోకి విసిరేశారు. దీంతో లోక్‌సభ నుంచి సుశీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు స్పీకర్‌. లోక్‌సభ క్లియరెన్స్‌తో రేపు రాజ్యసభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు చర్చకు రానుంది.

అసలు సీన్‌ రాజ్యసభలోనే..
ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు మే 19న ఇచ్చిన ఆర్డినెన్స్‌పై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ జరుగుతోంది. అది నిరంకుశ ఆర్డినెన్స్‌ అని బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలు గొంతు చించుకుంటున్నాయి. రాజకీయ వైరుధ్యాలను పక్కకు పెట్టి ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కార్‌కు మద్దతును ప్రకటిస్తున్నాయి. ఆ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు.. లోక్‌ సభ , రాజ్యసభ రెండూ ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. అయితే రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 110 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్‌సహా అన్ని విపక్ష పార్టీలు కలుపుకుని 128 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో.. పెద్దల సభలో బిల్లును ఓడించాలనే ధీమాతో విపక్ష ఇండియా కూటమి ఉంది. 

ఆర్డినెన్స్‌లో ఇలా..
ఢిల్లీలో పాలనాధికారం అసెంబ్లీకే ఉంటుందని.. అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ అక్కడి ప్రభుత్వానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మే 11న తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును పక్కన పెడుతూ మే 19న కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ తెచ్చింది. నగర పాలనపై అసాధారణ అధికారాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతుల్లో పెడుతూ ఆర్డినెన్స్‌ జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్‌–ఏ అధికారుల పోస్టింగ్, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఢిల్లీలోని అధికారుల పోస్టింగ్, బదిలీలతోపాటు విజిలెన్స్‌ అధికారాలు ఎల్జీ చేతిలోకి వెళ్లాయి. నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీకి చైర్మన్‌గా ఢిల్లీ సీఎం ఉంటారు. మెంబర్లుగా సీఎస్, హోంశాఖ కార్యదర్శి ఉంటారు. ఢిల్లీలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్‌ ఇవ్వాలన్నా ఈ ముగ్గురు సమావేశమై, ఓటింగ్‌ నిర్వహించి ఎల్జీకి నివేదించాలి. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్‌ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే తుది నిర్ణయంగా ఉంటుంది. నగరంలోని పోలీస్‌ వ్యవస్థ మొత్తం ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉంది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం ఎల్జీదే. సివిల్‌ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్‌తో ఆ అధికారాలు కూడా లేకుండా పోతాయి.

ఇప్పటిది కాదు..
ఢిల్లీలో ఎవరి అధికారాలు ఏంటన్న దానిపై 2015 నుంచే వివాదం నడుస్తోంది. కేంద్రంలో మోదీ సర్కార్‌ రాగానే.. ఢిల్లీ పాలనాధికారాలను మొత్తం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలో పెట్టింది. అప్పుడే కొత్తగా ఏర్పడిన అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వాన్ని డమ్మీని చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపించాయి. కేంద్రం నిర్ణయంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లటంతో.. కేంద్రం నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో కేజ్రీ సర్కార్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదాన్ని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎల్జీ, ఎన్నికైన ప్రభుత్వం మధ్య స్పష్టమైన అధికారాల విభజనను సూచిస్తూ ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. ఢిల్లీ నగరంలో శాంతిభద్రతల బాధ్యత మాత్రమే ఎల్జీదని, ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు అసెంబ్లీకే చెందుతాయని తీర్పు ఇచ్చింది.

సుప్రీం తీర్పును కాదని..
అయితే సుప్రీం తీర్పు వచ్చి వారం గడవక ముందే ఆ తీర్పును కాదని కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ తెచ్చింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా నగరంలో అధికారాల సమతుల్యత కోసమే ఈ ఆర్డినెన్స్‌ తెచ్చామని కేంద్రం వాదిస్తోంది. కానీ ఆప్‌ ప్రభుత్వం మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం అంటోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంటోంది.

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జోక్యమే ఇది..
రాజ్యాంగం ప్రకారం.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే పాలన సాగించాలి. కానీ ఢిల్లీ విషయంలో మాత్రం కేంద్రం ఆ అవకాశం లేకుండా చేస్తోందని విపక్ష ఇండియా కూటమి నేతలు అంటున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల పాలనలో కేంద్రం జోక్యం చేసుకుంటోందని, అవసరమైతే కూలుస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు అధికారాలు కూడా కోత పెడితే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని విపక్షాల వాదనం. ఈ నేపథ్యంలో బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని పట్టుదలతో ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

బిల్లు పెట్టిన అమిత్‌షా..
ఈ వివాదం కొనసాగుతుండగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆర్డినెన్స్‌ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల వ్యతిరేక నినాదాల మధ్యనే బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభ వాయిదా పడింది. అయితే లోక్‌సభలో సంఖ్యాబలం ఉన్నందున బిల్లు సులువుగానే పాస్‌ అయయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement