కోయంబత్తూర్‌లో జరిగిన ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరాం రమేష్' బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) భారతదేశంలో ఉద్యోగ సృష్టికర్తలని ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలోకి రాకముందు తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి చెందిందని.. 10 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండేవని జైరాం రమేష్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నోట్ల రద్దు, జీఎస్టీ, సరైన ప్రణాళిక లేని కోవిడ్ లాక్‌డౌన్ వంటివి రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు.
తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక దాదాపు 1,000 చిన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వస్త్ర ఎగుమతులు రూ.30000 కోట్ల నుంచి రూ.26000 కోట్లకు పడిపోయాయని ఆయన అన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఎన్‌డీఏ ప్రభుత్వం వేసిన రెండో దెబ్బ జీఎస్టీ అని రమేష్ అన్నారు.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వాణిజ్య పరిమాణం బాగా తగ్గింది. 2017-18లో తిరుప్పూర్ నుంచి రూ. 16,000 కోట్ల మేరకు వస్త్ర ఎగుమతులు తగ్గాయి. మూడు లక్షల మంది కార్మికులకు ఆసరాగా నిలుస్తున్న శివకాశి బాణాసంచా పరిశ్రమలో ఉత్పత్తి 20 నుంచి 25 శాతం తగ్గిందని జైరాం రమేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment