సాక్షి, అమరావతి, శ్రీకాకుళం రూరల్: ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నందుకే తమలాంటి వాళ్ల పీక నొక్కాలని కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయని రెవెన్యూ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. తన నోరు మూయడం కోసమే తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 2005లో కొన్ని ఎన్‌ఓసీలు ఇచ్చారని, అవన్నీ అప్పట్లో మంత్రిగా ఉన్న ధర్మాన ప్రయోజనాలకోసమే జరిగాయని పేర్కొంటూ ఇప్పుడు ‘ఈనాడు’ పత్రిక వరస కథనాలు వేస్తుండటంపై ఆయన స్పందించారు.
‘‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉండాలని కొన్ని గొంతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అలాంటి గళాలన్నిటినీ నొక్కి ఆ పత్రికలు ఏం సాధించాలనుకుంటున్నాయో నాకైతే అర్థం కావటం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇలా గొంతులు నొక్కటం ద్వారా అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ మాఫియాను నిర్మించాలనుకుంటున్నారని, అదే వారి ప్రయోజనమని చెప్పారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను సృష్టించి ఆస్తులు సంపాదించాలనే తాపత్రయం తప్ప వారి ఆలోచనల్లో ప్రజల కోణం ఏమీ లేదన్నారు.
స్వల్ప ప్రయోజనాల కోసం వాళ్లు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, తాము విశాల ప్రయోజనాల కోసం పోరాటం మొదలుపెట్టామని స్పష్టంచేశారు. ‘‘నాది 40 సంవత్సరాల రాజకీయ జీవితం. అలాంటి నా క్యారెక్టర్‌పై మచ్చ వేయటం వారి తరం కాదు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న చంద్రబాబు కుట్రలను ఎదుర్కోవటమే మాకు ముఖ్యం. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలే మాకు ప్రధానం’’ అన్నారు. వాళ్లు ఆరోపిస్తున్న వ్యవహారాలను చూస్తే... ఎన్‌ఓసీలు ఇవ్వటం వంటివి మంత్రి నిర్ణయం తీసుకునేవి కాదని, కలెక్టర్ల స్థాయిలోనే ఆ నిర్ణయాలు జరుగుతాయని వివరించారు.
‘‘చంద్రబాబు కూడా రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు. ఆయనకు ఇవన్నీ తెలియదా? మసిపూసి మారేడు కాయ చేయాలనుకుంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రికి, జిల్లా స్థాయిలో కార్యకలాపాలకు సంబంధం ఉండదని, జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల స్థాయిలోనే ఇదంతా జరుగుతుందని చెప్పారు. వికేంద్రీకరణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే ఈ తరహా తప్పుడు రాతలు రాస్తున్నారంటూ... ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం ఇంకా గట్టిగా గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.
రాజధానికన్నా పదవి ముఖ్యం కాదు
విశాఖ రాజధాని కావాలా.. మంత్రి పదవి కావాలా..? అని అడిగితే ఉత్తరాంధ్ర ప్రజల కోసం మంత్రి పదవినైనా వదిలేస్తానని ధర్మాన ప్రసాదరావు స్పష్టంచేశారు. శ్రీకాకుళంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొని ఉద్వేగంగా మాట్లాడారు. రాష్ట్రం విడిపోయాక శివరామకృష్ణన్ కమిటీ, శ్రీభాగ్ కమిటీ వంటివి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అవసరమని ప్రతిపాదించాయని గుర్తు చేశారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చంద్రబాబు తన ఇంటిలో స్కెచ్ వేసి అమరావతి, గుంటూరు, నూజివీడు ప్రాంతాలనే రాజధానిగా ప్రకటించి ఇతర ప్రాంతాల వారి నోట్లో మట్టి కొట్టారని దుయ్యబట్టారు.
రాజధాని కోసం మద్రాసుకు 70 ఏళ్లు, కర్నూలుకు మూడేళ్లు, హైదరాబాద్‌కు 58 ఏళ్లు పరుగులు పెట్టామని, 130 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసులు రాజధానికి దూరంగానే ఉన్నారని వివరించారు. విశాఖలో వాయు, జల, రైలు మార్గాలు అనువుగా ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉత్తరాంధ్రులంతా ఏకమై విశాఖకు రాజధాని తెప్పించుకోవాలన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అమరావతిలో కేవలం చెట్లు, రేకులు తప్ప ఏమీ లేవన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఉత్తరాంధ్ర గొంతు నొక్కటానికే తప్పుడు రాతలు
Published Mon, Oct 17 2022 4:44 AM | Last Updated on Mon, Oct 17 2022 4:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment