
జనసేన జెండా దిమ్మ ధ్వంసానికి యత్నించిన టీడీపీ నాయకుడు
ఆందోళనకు దిగిన జన సైనికులు
టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ కూటమి పార్టీల్లో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. పట్టణంలోని నాగవరప్పాడు సెంటర్‌లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన ఆ జెండా దిమ్మను ప్రారంభించడానికి వీల్లేదని, దానిని తొలగించాలని టీడీపీ నేత దారం నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం అర్ధరాత్రి నరసింహారావుకు జన సైనికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరసింహారావు పలుగుతో జెండా దిమ్మను ధ్వంసం చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ జనసేన కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నరసింహారావు వెళ్లిపోయారు. వెంటనే జనసేన కార్యకర్తలు ఎంఎన్‌కె రహదారిపై బైఠాయించారు. నరసింహారావును అప్పగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనసైనికులు ఆందోళన విరమించి బైక్ ర్యాలీగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నరసింహారావుపై ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన దారం నరసింహారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని బూరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆధిపత్యం కోసం దారం నరసింహారావు పట్టణంలో వర్గ విభేదాలు సృష్టించి సంఘ విద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.