
న్యూఢిల్లీ: ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 సంబంధిత ఆంక్షలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం మరింతగా సడలించింది. పరిమిత సంఖ్యలో జనంతో పాదయాత్రలు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే ప్రచార సమయాన్ని రోజుకు నాలుగు గంటలు పెంచింది. ఇప్పటిదాకా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ఈ ప్రచార వేళలను ఈసీ ఉదయం 6 నుంచి రాత్రి పది గంటలకు వరకు పొడిగించింది.
ఫలితంగా అభ్యర్థులు, పార్టీలకు రోజుకు నాలుగు గంటలపాటు అదనంగా ప్రచార సమయం లభించనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు జనవరి 8న షెడ్యూల్‌ను ప్రకటిస్తూ కోవిడ్–19 కారణంగా ఈసీ పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ర్యాలీలు, రోడ్‌షోలు, పాదయాత్రలపై నిషేధం విధించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ఈసీ క్రమేపీ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది.
యాభై శాతం సామర్థ్యానికి పరిమితమై బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఈసీ శనివారం తెలిపింది. మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆంక్షలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, బహిరంగ వేదికల్లో సమావేశస్థలి సామర్థ్యంలో ఎంత శాతం మందిని అనుమతించాలనే విషయంలో ఈసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు పెట్టిన పరిమితుల్లో ఏది తక్కువగా ఉంటే.. అదే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment