Goa Assembly Election 2022: స్వల్ప ఓట్ల తేడాతోనే తలరాత మారుతుంది! - Sakshi
Sakshi News home page

స్వల్ప ఓట్ల తేడాతోనే తలరాత మారుతుంది!

Feb 13 2022 9:45 AM | Updated on Feb 13 2022 11:21 AM

Parties In The Ring Of Goa Elections Challenge to BJP - Sakshi

Goa Assembly Election 2022: గోవా అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠని రేపుతున్నాయి. లెక్కకు మించిన పార్టీలు ఎన్నికల బరిలో నిలిచి అధికార బీజేపీకి సవాల్‌ విసురుతున్నాయి. చిన్న చిన్న నియోజకవర్గాలతో  ఓటింగ్‌ మార్జిన్, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో నిలిచిపోయిన మైనింగ్‌ కార్యకలాపాలే ఈసారి కీలకంగా మారాయి. బీజేపీ అధికార వ్యతిరేకత, అంతర్గత సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే, కాంగ్రెస్‌ ఫిరాయింపులతో సతమతమవుతోంది. ఈ రెండు పార్టీల మధ్యలో ఆమ్‌ ఆద్మీ నేనున్నానంటూ ఈసారి గట్టి ప్రయత్నమే చేసింది.  

గోవాలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. బీజేపీ హిందుత్వ ఎజెండా స్థానంలో అభివృద్ధి ఎజెండాను తీసుకువచ్చిన మనోహర్‌ పారికర్‌ వంటి దిగ్గజ నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది. పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌కు పనాజీ నుంచి టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం, కాంగ్రెస్‌ వలస నేతలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంతో ఏర్పడిన అంతర్గత సమస్యలు కమలనాథులకి తలనొప్పిగా మారాయి.

ఇక కాంగ్రెస్‌ కూడా ఫిరాయింపుల సమస్యని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నుంచి గత అయిదేళ్లలో ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, మాజీ ముఖ్యమంత్రి లూజినో ఫలేరియో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూటికి చేరడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. రాష్ట్ర స్థాయిలో సరైన నాయకులు లేకపోవడంతో కాంగ్రెస్‌ ఏకంగా 31 మంది కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. వారిలో 18 మంది మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యలో ఆప్‌  
మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ, గోవా ఫార్వార్డ్‌ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఈ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2017 ఎన్నికల్లో 39 స్థానాల్లో పోటీ  చేసిన ఆప్‌ ఒక్క స్థానాన్ని గెలవలేకపోయినా 6.27 శాతం ఓట్లు సాధించడంతో పాటుగా అత్యధిక స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా మైనింగ్‌ పునరుద్ధరణ,  క్యాథలిక్‌ బెల్ట్‌పై అధికంగా దృష్టి సారించి బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్‌ విసురుతోంది. మమతా బెనర్జీ తన ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌తో తొలుత హల్‌చల్‌ చేశారు. కాంగ్రెస్‌ నుంచి నాయకుల్ని తమ పార్టీలోకి లాగినప్పటికీ ప్రచారంలో బాగా వెనుకబడిపోయారు. ఇక ఎన్‌సీపీ, శివసేన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా వారి ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. అయితే వివిధ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

స్వల్ప ఓట్ల తేడాతోనే తలరాత మారుతుంది! 
40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అతి చిన్న రాష్ట్రం కావడంతో ఓటింగ్‌ మార్జిన్‌ ఎప్పుడూ కీలకాంశంగా ఉంటుంది. కేవలం 500 ఓట్ల తేడాతోనే అభ్యర్థులు విజయం సాధించడం ఇక్కడే చూస్తుంటాం. ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా 26–28 వేల మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. దీంతో స్వల్ప ఓట్ల తేడాతో విజయావకాశాలు తారుమారు అవుతాయి. ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొని ఉండడంతో... ప్రజా నాడి తెలుసుకోవడం కష్టంగా మారింది. 2017 ఎన్నికల్లో ఏడు స్థానాల్లో వెయ్యి కంటే తక్కువ ఓట్లతోనే విజయం లభించింది. కాంగ్రెస్‌ పార్టీ కంకోలిమ్‌లో కేవలం 33 ఓట్లతో నెగ్గితే, మార్మగోవాలో బీజేపీ 140 ఓట్ల తేడాతో విజయం సాధించడం విశేషం.

మైనింగ్‌ నిలిచిపోయి.. 1.5 లక్షల మంది ఉపాధిపై దెబ్బ 
మైనింగ్‌ అంశం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. దేశంలో ఉక్కు ముడి ఖనిజం, మాంగనీస్‌ ఉత్పత్తిలో గోవా మూడో స్థానంలో ఉంది. సుప్రీంకోర్టు మైనింగ్‌ కార్యకలాపాల్ని 2018లో నిలిపివేయడంతో 1.5 లక్షల మంది ఉపాధిని కోల్పోయారు.  1961లో గోవా ఆవిర్భావం సమయంలో మైనింగ్‌ తవ్వకాల్ని 2007 వరకు లీజుకి ఇచ్చారు. లీజు గడువు ముగిసిపోయినా అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగడంతో కొందరు కోర్టుకెక్కారు. దీంతో సుప్రీంకోర్టు మైనింగ్‌ను  నిలిపివేసింది.

ఆ తర్వాత జరిగే ఎన్నికలు ఇవే కావడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారాయి. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌లు మైనింగ్‌పై ఆధారపడే కుటుంబాలను ఈ ఎన్నికల్లో తరచూ కలుసుకున్నారు. కేజ్రివాల్‌ ఓ అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే మైనింగ్‌ కార్యక్రమాలు పునరుద్ధరించేంత వరకు  నిరుద్యోగ భృతి కింద వారికి నెలకి రూ.5,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక అధికార బీజేపీ అక్రమంగా మైనింగ్‌ చేసిన వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేసే పనిలో ఉంది. ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ అక్రమ మైనింగ్‌ దారులపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేశారు.  

ప్రచారాస్త్రాలు ఇవే..
గోవా ఎన్నికల ప్రచారంలో అవినీతి ప్రతిపక్షాలకు అతి పెద్ద అస్త్రంగా మారింది. మాజీ గవర్నర్, బీజేపీ నాయకుడు సత్యపాల్‌ మాలిక్‌ స్వయంగా గోవాలో ప్రతీ చోటా అవినీతి ఉందని వ్యాఖ్యానించడంతో ఇదే ప్రధానాంశం అయింది. మేఘాలయా గవర్నర్‌గా బదిలీ కాకముందు మాలిక్‌ 2019 నవంబర్‌ నుంచి 2020 ఆగస్టు వరకు గోవా గవర్నర్‌గా ఉన్నారు.

కాసినో (జూదం) సంస్కృతి కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినిపించింది. 2012లో బీజేపీ అధికారంలోకి రాకముందు కాసినోలపై నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాసినో ఇండస్ట్రీకి అధికార పార్టీ కొమ్ము కాస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ జూదశాలలపై నిషేధం విధిస్తామని హామీ ఇస్తూ విస్తృతంగా ప్రచారం చేసింది.  

గోవా ప్రాంత సంస్కృతి పరిరక్షణ కూడా ప్రముఖంగా మారింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో  ఏ భాషలో బోధన కొనసాగించాలన్న అంశం వివాదాస్పదమైంది. కొంకణి, మరాఠి, ఇంగ్లిషు భాషల్లో ఎందులో బోధించాలనే చర్చ కూడా జరుగుతోంది.  

గోవాకు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఈసారి కొన్ని పార్టీలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ వల్ల ప్రత్యేక హోదా రాదని మెజార్టీ గోవా ప్రజల అభిప్రాయంగా ఉంది. దీంతో ఆప్‌ ఈ అంశాన్ని తమకి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర జనాభాలో 26 శాతం ఉన్న క్యాథలిక్‌ క్రైస్తవుల నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చింది.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement