
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం ద్వారా మునుగోడు ప్రజల మెదళ్లలో పచ్చి అబద్ధాలు నాటి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల విశ్వసనీయత కేసీఆర్ కోల్పోయారని, ఆయన మాటలు ఎవరూ నమ్మబోరని అన్నారు. కేసీఆర్‌కు మునుగోడు గడ్డమీద ఓటు అడిగే నైతికత లేదని ఈటల ఒక ప్రకటనలో తెలిపారు.
మునుగోడు సభలో నలుగురు ఎమ్మెల్యేలు పరమ పవిత్రులు అని కేసీఆర్ చెబుతున్నారని, వీరిలో ముగ్గురు పార్టీ మారినా రాజీనామా చేయాలనే సంస్కారం లేనివారని మండిపడ్డారు. అలాంటి వారిని పరమ పవిత్రులు అని చెప్పడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలని దుయ్యబట్టారు. రాష్ట్రానికి సీబీఐ రావద్దంటూ జీవో ఇచ్చారంటే రాజ్యాంగ సంస్థల మీద కేసీఆర్‌కు నమ్మకం లేదా? అని నిలదీశారు. వామపక్ష నేతలను అటు ఒకరిని ఇటు ఒకరిని కూర్చోబెట్టుకున్నంతమాత్రాన కేసీఆర్ పవిత్రుడు కాలేరన్నారు. లెఫ్ట్ పార్టీలను బొంద పెట్టాలని కేసీఆర్ అన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు.