
వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, నెల్లూరు జిల్లా: వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు బాబు వెస్ట్.. జగన్ బెస్ట్ అని వరద బాధితులు అంటుంటే.. బాబుకి కడుపు మండుతుందన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే వరదలకు కారణమని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు పచ్చ మీడియా అబద్ధాలు రాస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చిన విపత్తును ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు, కేబినెట్ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పుకునే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ.. ప్రజలు కష్టాల్లో ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడకి పోయారు?’’ అంటూ కాకాణి ప్రశ్నించారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా.. జాత్వని కేసుకు అంత ప్రయార్టీ ఎందుకు ఇచ్చారు.. నలుగురు ఐపీఎస్‌లపై ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టడం దారుణం. వరదలో బోటు కొట్టుకుని ప్రకాశం బ్యారేజీకి వస్తే దానిపై విచారణ అనడం ఏంటి..?. జగన్ జనాల్లోకి వస్తే.. చంద్రబాబుకి నచ్చడం లేదు.. అందుకే మాపై బురద చల్లుతున్నారు’’ అని కాకాణి ధ్వజమెత్తారు.
‘‘వరదల్లో చిక్కుకున్న చిన్నపిల్లలు, వృద్దులు, గర్భిణులు ఆకలితో అలమటిస్తుంటే వారికి ఆహారం కూడా అందించలేక పోతున్నారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ రేషన్ అందించే వాహనాల సేవలు కోసం చంద్రబాబు అర్రులు చాచారు’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు.