
సాక్షి, అమరావతి: మాయే చంద్రబాబు మంత్రం. మోసమే ఆయనకు తెలిసిన తంత్రం. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడు. 2014 ఎన్నికల్లో ఉమ్మడిగా కలిసి పోటీ చేసిన చంద్రబాబు, పవన్.. అప్పట్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేశారు. ఆ తర్వాత అసలు ఆ మేనిఫెస్టోనే కనపడకుండా పార్టీ వెబ్‌సైట్ నుంచి తొలగించారు. వీరిద్దరూ కలిసి మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి కార్యక్రమాలు అంటూ హడావుడి చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసే పోటీ చేశారు. 600కు పైగా హామీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబుతోపాటు పవన్ ఫొటో కూడా ముద్రించారు. అప్పుడు ఇద్దరూ కలిసే జనానికి హామీలు ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పీఠమెక్కాకు ముసుగు తొలగంచి, అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. ఆ హామీలను అమలు చేయకపోగా, అసలు మేనిఫెస్టోనే చెత్త బుట్టలో వేశారు. ప్రజలను నిలువునా మోసగించారు. రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దారుణంగా వంచించారు.
అధికారంలోకి వచ్చాక మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని, మీరు పైసా కట్టకండి అని చెప్పి.. తీరా చంద్రబాబు సీఎం అయ్యాక రైతులు, మహిళలను ముప్పుతిప్పలు పెట్టారు. వారు వడ్డీతో సహా రుణాలు చెల్లించుకోవాల్సి వచ్చింది. జాబు రావాలంటే బాబు రావాలంటూ యువతనూ నిలువునా ముంచారు. పింఛన్ల పేరుతో వృద్ధులు, దివ్వాంగులను ఎన్ని అవస్థలు పెట్టాలో అన్నీ పెట్టారు. ఇళ్లు, స్థలాల పేరుతో అందరినీ మోసం చేశారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. అమరావతి రాజధాని పేరుతో ఓ మాయా ప్రపంచాన్నే కళ్ల ముందు నిలబెట్టి చక్కబెట్టుకున్న వ్యవహారాలు, సొంత వారికి చేసిన మేలు కళ్లకు కడుతూనే ఉంది.
చివరకు తాము ఇచ్చిన హామీలు ప్రజలకు కనపడకుండా పార్టీ వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టోనే తొలగించేశారు. మాటిమాటికీ ప్రశ్నిస్తానంటూ మాట్లాడే పవన్.. ఆనాడు చంద్రబాబు చేసిన మోసాలను, అవినీతిని, అరాచకాలపై ఒక్క ప్రశ్న వేయకపోగా, చంద్రబాబుతో బంధాన్ని మరింత పెంచుకున్నారు. గతంలో మోసం చేసినట్లే మళ్లీ ఇప్పుడు కూడా ఉమ్మడిగా ప్రజలను మోసం చేయడానికి ఇద్దరూ సిద్ధమైపోయారు. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి జైలుకు వెళ్లిన చంద్రబాబును వెనకేసుకొచ్చారు.
బాబు జైలుకు వెళ్లిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి ఆయనతో ములాఖత్ అయ్యారు. అవినీతిని బట్టబయలు చేసి, చంద్రబాబును జైలుకు పంపిన ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. ఆ తర్వాత కూడా ప్రతి విషయంలో అంటకాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి కార్యక్రమాలతో మరోసారి ఈ ద్వయం ప్రజలను వంచించడానికి వస్తోంది.
చేసేదంతా బాబే
చంద్రబాబు, పవన్ కలిసి పని చేస్తున్నప్పటికీ, వాస్తవంగా నిర్ణయాలన్నీ చంద్రబాబువే. వాటికి వత్తాసు పలకడం పవన్ వంతు. వాస్తవానికి చంద్రబాబు మహానాడులో 6 అంశాలతో ఓ మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పుడు దానికే మరో 6 హామీలను జనసేన ఇస్తున్నట్లు చూపించి మొత్తం 12 అంశాలతో ఉమ్మడిగా మేనిఫెస్టో అంటూ ఒకటి తయారు చేశారు. నిజానికి జనసేన ఆరు హామీలు కూడా చంద్రబాబు చెప్పినవే. వాటికి జనసేన కలర్ మాత్రమే ఇచ్చారు. త్వరలో ఈ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
జనసేన అభ్యర్థుల ఎంపికలోనూ చంద్రబాబుదే నిర్ణయమనేలా పవన్ చర్యలు ఉన్నాయి. అసలు రెండు పారీ్టల మధ్య పొత్తు కుదిరినప్పటికీ, ఇంతవరకు సీట్ల సర్దుబాటు జరగలేదు. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే విషయం తేలలేదు. పవన్ 50 అసెంబ్లీ, రెండు లేదా మూడు లోక్‌సభ సీట్లు అడుగుతుండగా చంద్రబాబు దానిపై ఏమీ తేల్చకుండా నాన్చుతూనే ఉన్నారు. 10 నుంచి 15 సీట్లు మాత్రమే జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీట్లు ఎన్ని ఇస్తారో తెలియకపోయినా, ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు పవన్ సమ్మతించడంపై జనసేన పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తారని, ఉమ్మడి జాబితా నిర్ణయం వెనుక మతలబు ఇదేనని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు. తొలి జాబితాలో 20 నుంచి 27 సీట్లను ప్రకటించాలని భావిస్తున్నారు. అందులోనే ఐదు లేక ఆరు సీట్లను జనసేనకు కేటాయించనున్నారు. ఆ తర్వాత జాబితాలో మరికొన్ని జనసేనకు వదలనున్నారు. చంద్రబాబు తెలివిగా సీట్లు తేల్చకుండానే సర్దుబాటును ప్రకటించి పవన్ కళ్యాణ్‌ను ఇరికించేస్తున్నారు. చివరికి తాను అనుకున్న మేరకే జనసేనకు సీట్లు ఇచ్చే పరిస్థితి కల్పించడం దీని వెనుక వ్యూహమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment