తిరువనంతపురం: 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన కేరళ అసెంబ్లీలో మరో అరుదైన ఘట్టం ఆకర్షణీయంగా మారనుంది. కేరళ అసెంబ్లీలో మామా అల్లుళ్లు కొలువుదీరనున్నారు. అది మరెవ్వరో కాదు ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన అల్లుడు మొహమ్మద్ రియాజ్. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయన్ 50 వేల పైచిలుకు మెజారిటీలో ఘన విజయం సాధించగా, కాన్నూర్ జిల్లాలోని ధర్మదాం నుంచి రియాజ్ ఎన్నికయ్యారు.
ఇప్పటిదాకా కేరళ అసెంబ్లీలో వివిధ రాజకీయ నాయకుల వారసులుగా కుమారులు, కుమార్తెలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ముఖ్యంగా కేరళ కాంగ్రెస్ (ఎం) చీఫ్ జోస్ కే మణి, ఆయన సోదరి భర్త, యూడీఎఫ్ అభ్యర్థి ఎంపీ జోసెఫ్ ఇద్దరూ పాల, త్రిక్కారిపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అలాగే తోడుపుళ నుంచి యూడీఎఫ్ అభ్యర్థిగా కేరళ కాంగ్రెస్ చైర్మన్ పీజే జోసెఫ్ గెలుపొందగా, కోతమంగళం నుంచి బరిలో నిలిచిన ఆయన అల్లుడు డాక్టర్ జోసెఫ్‌కు నిరాశే ఎదురైంది. అంతేనా వీరితోపాటు కాంగ్రెస్ నేతలు, దివంగత ముఖ్యమంత్రి కరుణాకరన్ వారసులు కే మురళీధరన్ (ఎంపీ), పద్మజా వేణుగోపాల్ కూడా ఓటమిని చవి చూడక తప్పలేదు. వీరితో పాటు 140 స్థానాలకు ఏప్రిల్ 6న జరిగిన పోలింగ్‌లో దాదాపు 20 మంది అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వారసులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో మామ అల్లుళ్లు కలిసి సభలో భాగం కావడం ఇదే మొదటిసారి. బహుశా ఈ సరికొత్త దృశ్యం ఆవిష్కారం కోసమే రియాజ్ 2009లో లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారేమో అని పలువురు చమత్కరిస్తున్నారు.
మరోవైపు ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఘన విజయం నేపథ్యంలో కేరళ సీఎం రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం విజయన్ గవర్నర్‌కు తన రాజీనామా సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment