
తిరువనంతపురం: అభివృద్ధి చెందిన రాష్ట్రంగా.. దేవభూమిగా పేర్కొనే కేరళలో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ప్రధాన పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీపీఐ (ఎం) అభ్యర్థిగా కన్నూరు జిల్లా ధర్మాడం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్‌లో పినరయి సమర్పించిన అఫిడవిట్‌లో ఉన్న వివరాలు ఆసక్తికరంగా మారాయి. కోటి రూపాయల ఆస్తులు కూడా లేకపోవడం గమనార్హం.
పినరయి ఆస్తులన్నీ కలిపితే కేవలం రూ.54 లక్షలు మాత్రమే ఉన్నాయి. 2020 21లో ఆయన వార్షిక ఆదాయం రూ.2.87 లక్షలుగా పేర్కొన్నారు. రెండు సొంత ఇళ్లు ఉన్నాయని, సొంత వాహనం లేదని ప్రకటించారు. పినరయి పేరిట రూ.51.95 లక్షల విలువైన స్థిరాస్తులు, 2.04 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పొందుపరిచారు. అయితే తన భార్య పేరిట రూ.35 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారని ఈ సందర్భంగా అఫిడవిట్‌లో పినరయి స్పష్టంగా రాయించారు. అయితే వీరిద్దరికీ అప్పులు ఏమీ లేకపోవడం విశేషం. భార్య పేరిట రూ.3.3 లక్షలు విలువ చేసే 80 గ్రాముల బంగారం ఉంది.
పినరయిపై రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. పినరయి 2016 నుంచి కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్లీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం సాధిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక్కడ సీపీఐ (ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 2వ తేదీన విడుదల కానున్నాయి.
చదవండి: హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళనాడు సీఎం
Comments
Please login to add a commentAdd a comment