అది 1952 మార్చి 27... కాలినడకన కొందరు, ఎడ్ల బండ్లపై మరికొందరు సుదూరాన ఉన్న పోలింగ్ బూత్‌లకు ఒకరెనక ఒకరు వెళ్లి తమ ఓటుతో తొట్టతొలి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకున్న రోజు. సుమారు 224 ఏళ్ల అసఫ్‌జాహీల రాచరికం, ఆపై నాలుగేళ్ల సైనిక పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో ఓటు వేసేందుకు జనం వస్తారో లేదోనన్న అధికారుల అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి ఎన్నికలోనే జనచైతన్యం ఓటెత్తింది.
అప్పటివరకు తుపాకుల నీడలో అభద్రత, భయం నీడలో తలదాచుకున్న వారంతా ఊరూరా కదిలి మొత్తంగా 52,02,214 మంది ఓటు వేయడంతో అధికార యంత్రాంగం సంబురపడింది. నాటి ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మాపూర్‌కు చెందిన జరుపాటి రాములమ్మ (110) తొలి ఓటు వేసి తమకు స్వాతంత్య్రం రావడం నిజమేనని నమ్మినట్టు పేర్కొంది.
మిశ్రమ ఫలితాలు...
నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థులు విజయం సాధించగా సత్యాగ్రహ పోరాటాలు జరిగిన హైదరాబాద్, ఔరంగాబాద్, గుల్బర్గా డివిజన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా తెలుగు ప్రజలు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు, పీడీఎఫ్ 35 స్థానాల్లో, సోషలిçస్టు పార్టీ 11 చోట్ల, మరో 10 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు.
బీఆర్ అంబేడ్కర్ ఆధ్వరంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్‌సీఎఫ్) 5 చోట్ల గెలవగా అందులో తెలంగాణలోని ద్విసభ నియోజకవర్గాలైన జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకుంది. అంటే మొత్తంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోని ఓటర్లు 66 స్థానాల్లో కాంగ్రేసేతర అభ్యర్థులను గెలిపించారు.
అప్పటి ఓటు.. ఇంకా గుర్తుంది
నాకు ఓటు వచ్చే సరికి 40 ఏళ్లు . ఇప్పుడు 110 ఏళ్ల వరకు ఉంటాయనుకుంటా. అప్పుడు ఎండాకాలం. ఊరోళ్లమంతా నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసినం. ఇంకా నాకు గుర్తుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు తప్పకుండా వేస్తున్న. – జరుపాటి రాములమ్మ, లక్ష్మాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా
తొలి సభలో అత్యధికం విద్యావంతులే..
హైదరాబాద్ తొలి శాసనసభకు ఉన్నత విద్యావంతులే అత్యధికంగా ఎన్నికైయ్యారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన మాసూమాబేగం శాలీబండ స్థానం నుంచి ప్రముఖ కవి ముగ్ధూం మోహియొద్దీన్‌ను ఓడించారు. 1927లో ఉస్మానియాలో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ జీఎస్ మెల్కొటే ముషీరాబాద్ నుంచి విజయం సాధించారు. చాదర్‌ఘాట్ నుంచి జస్టిస్ గోపాలరావు ఎక్బోటే, సోమాజిగూడ నుంచి మెహిది నవాజ్ జంగ్, వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి, షాద్‌నగర్ నుంచి బూర్గుల రామకృష్ణారావు, వికారాబాద్ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, బేగంబజార్ నుంచి కాశీనాథ్ వైద్య గెలుపొందారు.
ఓటు వేయకపోవడం చనిపోవడంతో సమానం..
నాకిప్పుడు 103 ఏళ్లు. తొలి ఎన్నికలప్పుడు మా ఊర్లో డప్పు చాటింపు వేసి ఓటు వేసేందుకు పిలుచుకొనిపోయిండ్రు. అప్పటి నుంచి ఓటు తప్పకుండా వేస్తున్న. ఓటు వేయకపోతే చనిపోవడంతో సమానమని నమ్ముత. వచ్చే ఎన్నికల్లోనూ ఓటు వేస్త. – మల్తుం బాలవ్వ, చిట్యాల, కామారెడ్డి
అజ్ఞాతం నుంచి చట్ట సభకు..
తొలుత నిజాం, ఆపై భారత సైన్యంపై తుపాకులు ఎక్కుపెట్టిన కమ్యూనిస్టు పార్టీల నాయకులు అనేక మంది అజ్ఞాతం వీడిన అనంతరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ వేసి స్వయానా తన బావమరిది భూదాన్ రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు.
గత 70 ఏళ్లలో ఓటు తప్పలేదు..
నాకిప్పుడు 98 ఏళ్లు. రజాకార్ల బాధలు ప్రత్యక్షంగా చూసినం. వారిపై తిరగబడినం. స్వతంత్రం వచ్చినంక తొలి ఎన్నికలో ఓటు వేసేందుకు ఎడ్లబండిలో పోయినం. 1952 ఎన్నికల నుంచి ప్రతిసారీ ఓటు వేస్తూనే ఉన్న... – చల్లారం మధురవ్వ, తిమ్మాయపల్లి, సిద్దిపేట
- శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment