సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో ప్రచారం ముగిసి ప్రలోభాల పర్వానికి తెరలేచింది. మంగళవారం పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఏదో ఒక పేరుతో ‘గెట్ టు గెదర్’లు పెట్టి.. రిటర్న్ గిఫ్ట్‌లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు సోమవారం ముమ్మరంగా సాగాయి. జీహెచ్‌ఎంసీలో ఈసారి ఎన్నికల ప్రచారం పోటాపోటీ జరిగింది. చాలా డివిజన్లలో నువ్వా– నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. దాంతో అభ్యర్థులు ‘ఆఖరి’అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రజలకు బహుమతులు, కానుకలు ఇచ్చి తమ వైపునకు తిప్పుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు.
వరుసగా సెలవులు రావడం, పైగా సోమవారం కార్తీకపౌర్ణమి కావడంతో ఓటర్లంతా ఇంటి వద్దనే ఉన్నారు. ఇదే చక్కటి అవకాశంగా భావించిన నేతలు తమ తెలివితేటలకు పదును పెట్టారు. గల్లీ నాయకులను రంగంలో దింపి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు రూపాల్లో కానుకలు ముట్టజెప్పారు. ఇక్కడే నేతలను ఒక అనుమానం వేధిస్తోంది. అదేంటంటే... వరుస సెలవుల నేపథ్యంలో ఓటర్లు ఇళ్లు విడిచి బయటకు వస్తారా? కానుకలు తీసుకున్న వారంతా ఓటేస్తారా? అని. అందుకే కానుకలు తీసుకున్న వాళ్లంతా పోలింగ్ బూత్‌కు వచ్చే దాకా వారితో టచ్‌లో ఉండాలని అనుచరులు, కార్యకర్తలను ఆదేశించారు.
నోములు, పార్టీల పేరుతో ప్రలోభాలు
ఎన్నికల ప్రచారం ముగియడం, తెల్లారితే ఓటింగ్ కావడంతో చాలామంది నేతలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా టౌన్‌షిప్పులు, అపార్ట్‌మెంట్లపె దృష్టిసారించారు. ఓటరు లిస్టు ఆధారంగా తమకు అనుకూలంగా ఉండేవారికి ఎక్కడికక్కడ ఆహ్వానాలు పంపారు. వారి స్థానిక సమస్యలు తీరుస్తామన్న హామీలతోపాటు కార్తీక నోములు, వ్రతాలు, బర్త్‌డేల పేరిట పలుచోట్ల విందులు నిర్వహించారు. వీటికి హాజరైన మహిళలకు రిటర్న్ గిఫ్ట్‌ల రూపంలో వెండి వస్తువులు, చీరలు, ఇతరత్రా కానుకలు ఇచ్చి ఆకట్టుకునే యత్నం చేశారు. ఇక బర్త్‌డే పార్టీల్లో, గెట్ టు గెదర్‌లలో పురుష ఓటర్లను మందు విందులతో ప్రసన్నం చేసుకున్నారు. నగదు పంపిణీ చేసి ఓట్లు వేయాలని కోరారు. అదే సమయంలో బస్తీలు, మురికివాడల్లో చాలామంది గల్లీ లీడర్ల సాయంతో ఓటుకు ఇంతని కుటుంబాలతో గంపగుత్తగా మాట్లాడుకుని నోట్లను పంచారు.
వచ్చేలా చూడండి!
ఆదివారం సాధారణ సెలవు. సోమవారం గురునానక్ జయంతి. మంగళవారం పోలింగ్ సందర్భంగా సెలవు... నగరపౌరులకు వరుసగా మూడురోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఓటర్లు ఓటు వేసేందుకు బయటికి వస్తారా? లేదా అన్న అనుమానం అభ్యర్థులను వెంటాడుతోంది. అందుకే... తమ నుంచి కానుకలు అందుకున్న వారంతా పోలింగ్ కేంద్రానికి వెళ్లేలా చూడాలని చాలామంది నాయకులు గల్లీ లీడర్లు, అపార్ట్‌మెంటు సెక్రటరీలు, కార్యకర్తలను పురమాయించారు. వీరంతా అదే పనిలో నిమగ్నమయ్యారు.
సోషల్ మీడియాలో నాన్‌స్టాప్
ప్రత్యక్ష ప్రచారం ఆదివారంతో ముగిసినా.. సోషల్ మీడియా, వాయిస్‌కాల్స్ ప్రచారహోరు మాత్రం ఆగడంలేదు. సెలవుల వల్ల జనమంతా ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ సమయాన్ని సమర్థంగా వాడుకోవాలన్న తాపత్రయంతో అభ్యర్థులు సోషల్‌మీడియా, వాయిస్‌కాల్స్ ప్రచారాన్ని ఆఖరు రోజు ముమ్మరం చేశారు. వాయిస్‌కాల్స్, ఫేస్‌బుక్, వాట్సాప్ సందేశాలు, ఎస్సెమ్మెస్... ఇలా అవకాశమున్న దేన్నీ వదల్లేదు. మొత్తానికి గ్రేటర్ ప్రచారం పుణ్యమాని... పలు పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలకు చేతినిండా పని దొరికింది.
Comments
Please login to add a commentAdd a comment