తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి వార్తలలోకి ఎక్కారు. ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆమెకు మధ్య విబేధాలు ఏర్పడిన నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను ఆమె కొన్ని విషయాలలో నిలదీసినట్లు మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాలలో మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే, నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన సంగతిని ఆమె ప్రస్తావించడం మరో ఎత్తుగా భావించాలి. నిజంగానే నిమ్స్ డైరెక్టర్ అనూహ్యంగా తప్పు చేశారు. వరంగల్ కు చెందిన ఆయనను కొద్ది సంవత్సరాల క్రితం నిమ్స్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. కానీ ఆ తర్వాత నిమ్స్‌పై సరైన అజమాయిషి కొరవడిందన్న అభిప్రాయం నెలకొంది.
చదవండి: హై కమాండ్‌పై కూడా తిరుగుబాటేనా.. టి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
ఆ డైరెక్టర్ కూడా ఆస్పత్రిని సరైన రీతిలో నడిపించలేకపోతున్నారన్న విమర్శ సిబ్బంది నుంచి వస్తుంటాయి. ఒకప్పుడు నిమ్స్ అంటే అత్యంత ప్రతిష్టాత్మక ఆస్పత్రి. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మొదలు రాజకీయ నేతలంతా తమ వైద్య అవసరాలకు నిమ్స్ కే వెళ్లేవారు. కానీ క్రమేపీ నేతలు అక్కడకు వెళ్లడం తగ్గించారు. కేసీఆర్‌తో సహా పలువురు యశోదా, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. రాజకీయ నేతలు తమ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లవచ్చు. పెద్దగా తప్పు పట్టలేం. కానీ నిమ్స్ డైరెక్టరే ఆ పని చేయడంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని చెప్పాలి.
తమిళసై అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించడం ద్వారా ప్రభుత్వాన్ని ఆమె ఇరుకునపెట్టే యత్నం చేశారని అనుకోవచ్చు. ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ గవర్నర్ అయ్యారు. సహజంగానే ఆమె రాజకీయంగా మాట్లాడుతున్నారన్న విమర్శలు రావచ్చు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఆమె కూడా తోడు అయ్యారన్న భావన రావచ్చు. ఆమె రాజకీయ పర్యటనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే యత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
మంత్రులు పలువురు ఆమెపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయినప్పటికీ ఆమె లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం విందుకు వస్తున్నట్లు చెప్పి , ఆ తర్వాత కేసీఆర్ రాకపోవడం ఆశ్చర్యపరచింది. గవర్నర్‌తో సహా పలువురు ప్రముఖులు సీఎం కోసం వేచి ఉండవలసిన పరిస్థితి రావడం అంత మంచి పరిణామం కాదు. ఒకవేళ సీఎంకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంగతి ముందుగానే చెప్పి ఉండాల్సింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు వివరణ వచ్చినట్లు లేదు.
తనకు హెలికాఫ్టర్ సదుపాయం కల్పించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి వరదల సందర్భంలో ఆమె ఎనిమిది గంటలపాటు ప్రయాణం చేసి భద్రాచలం వెళ్ల వలసి వచ్చింది. వాతావరణ సమస్య కారణంగా సీఎం కూడా ప్రత్యేక బస్సులో ప్రయాణించారు. ఇదొక్కటని కాదు. ఆయా చోట్లకు గవర్నర్ వెళ్లదలిస్తే ప్రభుత్వం సహకరించడం లేదని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని ఆమె భావన.
అయితే ఆమె పర్యటనలన్నీ రాజకీయ ప్రేరితం అని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. అయినా ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వం చేస్తున్నది రైటా? రాంగా? అన్న చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండా ఎగురవేసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఇది కూడా గతంలో ఎన్నడూ జరగని విషయమే. రాష్ట్ర ప్రభుత్వం తనను గౌరవించడం లేదని, వివక్ష చూపుతున్నారని, అయినా తాను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, రాజ్‌భవన్‌ను ప్రజల కోసం తెరిచే ఉంచుతానని ఆమె చెప్పారు. తద్వారా ఆమె ప్రభుత్వంతో ఘర్షణకు వెనుకాడడం లేదని స్పష్టంగా చెబుతున్నట్లుగా ఉంది. ఇటీవలికాలంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు తీవ్రంగా శ్రమిస్తుండడం, పలు వ్యూహాలు అమలు చేస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్‌తో ఆ పార్టీ బాగా ఘర్షణ పడుతోంది.
గవర్నర్ కూడా అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ఆమె అలా ఓపెన్ కావచ్చా? అన్న ప్రశ్న ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అందులో పెద్ద ఆశ్చర్యం లేదనే చెప్పాలి. మరో ఏడాది లో శాసనసభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య మరిన్ని రాజకీయ వివాదాలు రావచ్చు. అసెంబ్లీలో తమిళసై ప్రసంగమే లేకుండా చేయడానికి టీఆర్ఎస్ కొత్త వ్యూహం అనుసరించింది.
అసెంబ్లీని ప్రోరోగ్ చేయకపోతే, ఎప్పటికీ లైవ్‌లోనే అంటే ఎప్పుడైనా సమావేశాలు నిర్వహించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఉంచుకోవడం అన్నమాట. ఒకవేళ ప్రోరోగ్ చేస్తే, మళ్లీ అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అంతేకాక ఏడాదిలో తొలి సమావేశంలో గవర్నర్ ప్రసంగం పెట్టడం ఆనవాయితీ. వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి వీలుగా కేసీఆర్ ఈ వ్యూహం అమలు చేశారు. ఇకపై తమిళసై రాష్ట్ర ప్రభుత్వంపై మరిన్న ఘాటు విమర్శలు చేయడానికి సిద్ధం అవుతారన్న అభిప్రాయం కలుగుతుంది.
కాగా పశ్చిమబెంగాల్‌లో కొద్ది కాలం క్రితం వరకు గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధంకర్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యక్షయుద్ధమే చేశారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో జగదీప్‌కు ప్రమోషన్ లభించి దేశానికి ఉప రాష్ట్రపతి అయ్యారు. అది గవర్నర్‌లకు ఒక సంకేతం అనుకోవచ్చేమో. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్‌లు క్రియాశీలకంగా ఉండేలా బీజేపీ ప్రోత్సహిస్తోందన్న విమర్శ ఉంది. ఏది ఏమైనా టీఆర్ఎస్, బీజేపీలు రెండు తమదైన శైలిలో రాజకీయ క్రీడలు సాగిస్తున్నాయి. దీంతో ఆయా వ్యవస్థలపై ఉన్న గౌరవం, విలువ తగ్గుతోంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment