సాక్షి, అమరావతి: జనసేన పార్టీ నేత పవన్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక విలన్ అని, చంద్రబాబుతో కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విశాఖ గర్జన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడమే వారి ఇరువురి ఏకైక లక్ష్యం అని ధ్వజమెత్తారు. అందుకే ఇద్దరూ కలసి ఈ రకమైన అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పవన్, బాబు కలిస్తే కలవొచ్చని, తమపై విమర్శలెందుకని సూటిగా ప్రశ్నించారు. మంత్రి అమర్‌నాథ్ ఇంకా ఏమన్నారంటే..
పీకే అంటే ప్యాకేజీల పవన్ కల్యాణ్
పీకే అంటే ప్యాకేజీల పవన్ కల్యాణ్.. పెళ్లిళ్ల పవన్ కల్యాణ్. నీవు ముమ్మాటికి ప్యాకేజీ నాయకుడివే. ఆ మాట అంటే చెప్పుతో కొడతావా? మరి నిన్ను ప్రజలంతా కలిసి అలాగే కొట్టాలా? రేపటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కొత్తదనాన్ని చూస్తారని పవన్ అన్నారు. కానీ రేపటివరకు ఆగలేకపోయారు. పెళ్లి, శోభనం ఒకరోజే అన్నట్లుగా వ్యవహరించారు. ఇద్దరూ కలిసిపోవడం, వారి మాటలు చూస్తే.. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నట్లుగా కాకుండా రాష్ట్రంలో అప్రజాస్వామిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నట్లు మాట్లాడుతున్నారు.
అసలు విశాఖలో ఏం జరిగింది? మంత్రులను ఎవరు కొట్టారు? వారిపై ఎవరు దాడిచేశారు? జనసేన కార్యకర్తలు కదా? మా పార్టీ కార్యకర్తలు జనసేనపై దాడిచేయలేదు కదా? అంటే దెబ్బతిన్న వారిని పట్టించుకోకుండా, దాడిచేసిన వారిని చంద్రబాబు పరామర్శిస్తున్నారు. పవన్ ఏదో గ్యాంగ్‌రేప్‌కు గురయినట్టు పవన్‌ను పరామర్శించడం ఏమిటి? అసలు ఆయనకు బుద్ధి ఉందా? ఏమన్నా అంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెబుతారు.
చెప్పుతో కొట్టడం అంటే ఏంటో తెలుసా?
ప్యాకేజీ నాయకుడివి అంటే చెప్పుతో కొడతావా పవన్? చెప్పులతో కొట్టడం అంటే ఏమిటో తెలుసా? నిన్ను గాజువాక, భీమవరంలో చిత్తుగా ఓడించారే.. అది చెప్పుతో కొట్టడం అంటే. నీ పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే అధికార పార్టీతో కలిసి వెళ్తున్నారు. అదీ చెప్పుతో కొట్టడం అంటే. జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేసిన రోజు మా వెంట దాదాపు రెండులక్షల మంది ఉన్నారు. మేము వారిని తీసుకురాలేమా? కానీ ఒకరిని ఒకరం గౌరవించుకోవాలి. అది మా పద్ధతి. మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్నావు.
నీ భార్యలకు భరణం ఇచ్చానని చెబుతున్నావు. అంటే పెళ్లి చేసుకోవడం.. ఏడాది, రెండేళ్లు గడిపి ఆ తర్వాత పరిహారం ఇచ్చి వదిలేయడం.. అదేనా నీ పద్ధతి. నీ మూడో భార్య నిన్ను వదిలిపోయిందా? అందుకేనా ఈ ఫ్రస్ట్రేషన్. మాకు సందేహం కలుగుతుంది. ఇప్పటి వరకు నీ భాషలో చంద్రబాబు నీకు స్టెప్నీనో.. లేక నీవు ఆయనకు స్టెప్నీవో. నిన్నటివరకు వేరుగా ఉన్నట్లు వ్యవహారం. ముసుగు దొంగలైన మీరిద్దరూ ఈరోజు మధ్యాహ్నం ఒక్కటయ్యారు.
రాష్ట్ర రాజకీయాల్లో పవన్ జీరో..
సినిమాల్లో పవన్ హీరో.. రాజకీయాల్లో జీరో. చిరంజీవి అనే వ్యక్తి ఆయనకు జీవితం ఇవ్వకపోతే పవన్ ఎక్కడ ఉండేవారు. గతంలో నాగబాబు కూడా పవన్‌ను తప్పుబట్టారు. ఈవాళ చేతికి కట్టుకట్టుకుని నిలబడ్డారు. పెళ్లి అనేది ఒక సర్దుబాటు జీవితం. సొంత ఇంట్లో భార్యనే సక్రమంగా ఏలుకోని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం ఏలతారు.
ఆయన ఎప్పుడు, ఏ పార్టీతో కలిసి ఉంటాడనేది ఎవరికీ తెలియదు. ఈ ఎనిమిదేళ్లలో ఎనిమిది పార్టీలతో పొత్తుపెట్టుకున్నారు. బీజేపీ వాళ్లు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఆయనకు కావాల్సింది చంద్రబాబును కలిసే రోడ్ మ్యాప్.
Comments
Please login to add a commentAdd a comment