
సాక్షి, విశాఖపట్నం: ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులపై జరిగిన దాడిని విశాఖ గర్జనపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయనకు ఉత్తరాంధ్ర ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
శనివారం ఆయన స్థానిక సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖను పాలనా రాజధానిగా చేయాలన్న నినాదంతో శనివారం నిర్వహించిన విశాఖ గర్జన కార్యక్రమాన్ని అన్ని టీవీ ఛానళ్లు, జాతీయ వార్తా సంస్థలు ప్రధానంగా చూపిస్తుండటం చూసి ఓర్వలేక ఈ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారని మండిపడ్డారు.
ఉద్యమానికి నాలుగు రోజుల ముందు నుంచే పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తారని తెలిసి, అతని పర్యటనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. విశాఖ వచ్చి ఉద్రిక్తతను సృష్టించారని, తద్వారా మీడియా దృష్టిని తన వైపునకు మరల్చుకుని, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల పై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అమర్‌నాథ్ ఇంకా ఏమన్నారంటే..
ఇక ఫ్లవర్ కళ్యాణ్ అనాలి..
► తనకు, తన పార్టీకి నష్టం వాటిల్లినా పర్వాలేదు కానీ చంద్రబాబుకు మంచి జరగాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు.
► గతంలో ఒక పత్రికా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తూ అడ్డొచ్చిన వారికి గన్ చూపించిన పవన్ కళ్యాణ్ నైజం ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
► ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను సమర్థించని పవన్.. విశాఖ వచ్చి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు. అందుకే ఆయన్ను పవన్ కళ్యాణ్ అని కాకుండా.. ఫ్లవర్ కళ్యాణ్ అని పిలిస్తే బావుంటుంది. గత ఎన్నికల్లో ఓడించారని ఈ ప్రాంతంపై కక్షకట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు.
► సైకో పార్టీకి సైకో కార్యకర్తలే ఉంటారు. జనసేన పార్టీకి సిద్దాంతాల్లేవు.. ఒక స్టాండ్ లేదు.. వ్యక్తిత్వం లేదు.. ఒక లక్ష్యం లేదు.. ఆకతాయి కార్యకర్తలు.. జనసేన పార్టీ నాయకుడే ఒక ఆకతాయి.. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం రాజధానంటావు.. ఊసరవెల్లిలా మాటలు మారుస్తావు.. నీకెందుకు పార్టీ? నీకెందుకు రాజకీయం? ఇంట గెలవని పవన్‌కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏమి ఉద్దరిస్తాడు? పెళ్లి అనేది ఒక సర్దుబాటు జీవితం. అందులో ఇమడలేని వాడివి ప్రజా జీవితంలో ఎలా నెగ్గుకువస్తావు? పెళ్లాంతో కాపురం చేయలేని వాడు.. రాజకీయ పార్టీ పెట్టి ప్రజలను ఏవిధంగా పరిపాలిస్తాడు? అందుకే ఆ ఫ్రస్టేషన్ అంతా చూపిస్తున్నావు.
ఈ సైకో పనులేమిటి?
► ఈ సైకో పనులు ఏమిటి? మంత్రులు, నాయకుల మీద దాడి ఏమిటి? వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తల్చుకుంటే మీరు కనీసం ఒక్క నిమిషం ఉండగలరా? మా ఫ్లెక్సీలు చింపడం ఏమిటి? అసలు నాయకుడికి క్యారెక్టర్ ఉంటే కదా? అది ఉంటే కార్యకర్తలు కూడా పద్ధతిగా ఉంటారు.
► నీకు నటన జీవితం ఇచ్చింది విశాఖపట్నం. తొలుత నీకు పిల్లను ఇచ్చింది విశాఖపట్నం. చివరికి నీవు పోటీ చేసింది విశాఖలోనే. అయినా అన్నీ మర్చిపోయావు. ఉత్తరాంధ్రను వాడుకుని, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయాలని చూస్తున్నావు. ఉద్యమానికి తూట్లు పొడవాలని చూస్తున్న నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఎవరు ఎవరి మీద దాడి చేశారు?