పశ్చిమగోదావరి, సాక్షి: చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ పై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామ జోగయ్య స్పందించారు. ఈ మేరకు పవన్‌కు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ మరో లేఖ రాశారు. చంద్రబాబు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదని.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని.. రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.
పవన్‌కు హరిరామ జోగయ్య ప్రశ్నలు
1. జగన్‌ను గద్దె దించడం అంటే చంద్రబాబును అధికారంలోకి తేవడమా?
2. చంద్రబాబును సీఎం చేయడం కోసం కాపులు పవన్ వెనకాల నడవాల?
3. కూటమి అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తానని ఎన్నికల ముందే చంద్రబాబు ప్రకటన చేస్తారా?
4. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత?
5. జనసేన సపోర్ట్ లేకుండా టిడిపి అధికారంలోకి రావడం కష్టమని 2019 ఫలితాలు చెప్పాయన్న విషయం గుర్తుందా?
జనసేనకు 27 నుంచి 30 సీట్లంటూ ఏకపక్షమైన ఎల్లో మీడియాలో వస్తోన్న వార్తలు చూస్తుంటే.. ఎవరిని ఉద్ధరించడానికని పొత్తు అని ప్రశ్నించారు హరిరామ జోగయ్య. ఆయా పార్టీ శ్రేణులు ఈ విషయాల్ని గ్రహించాలంటూనే లేఖలో మరిన్ని అంశాల్ని ప్రస్తావించారాయన. వైఎస్సార్‌సీపీని రాజ్యాధికారం నుండి తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని.. అసలు కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్ తో కలిసి ప్రయాణం చేస్తుంది ఈ ఆలోచనతో కాదనే విషయాన్ని గుర్తించాలని లేఖలో జోగయ్య పేర్కొన్నారు. జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని.. అందుకే 2019 ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారాయన.
175 సీట్లు ఉన్న రాష్ట్రంలో జనసేన కనీసం 50 సీట్లలోనైనా పోటీ చేసే అవకాశం దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్న నమ్మకం వస్తుందని తెలిపిన జోగయ్య.. తప్పనిసరిగా 40-60 సీట్ల మధ్య పోటీ చేసి తీరాలని పవన్‌కు మరోమారు సూచించారు. అధికారం అంతా చంద్రబాబుకే ధారపోస్తే మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయంటూ పవన్ కల్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. అలాగే.. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం జరగకపోయినా.. ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడతానని చంద్రబాబు ఎన్నికల ముందే ప్రకటించగలుగుతారా? అని జోగయ్య లేఖ ద్వారా నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment